గీజర్‌ లేకుండానే గరమ్‌ గరమ్‌

21 Dec, 2016 03:44 IST|Sakshi
గీజర్‌ లేకుండానే గరమ్‌ గరమ్‌

చలికాలంలో.. వెచ్చటి నీళ్లు
- బోరు నుంచి ఉబికి వస్తున్న వేడి నీళ్లు
- జయశంకర్‌ జిల్లాలో ప్రకృతి అద్భుతం


సాక్షి, భూపాలపల్లి: గోదావరి ఒడ్డున ఉన్న రామన్నగూడెంవాసులు గట్టకట్టే చలిలో సైతం తేలిగ్గా స్నానం చేయగలరు. ఈ ఊరిలో నిరంతరం పొగలు కక్కె వేడినీరు అందించే వేడినీటి ఊటబావి ఉండటమే అందుకు కారణం. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ వేడి నీటి ఊట నిరాదరణకు లోనవుతోంది. పర్యాటక శాఖ పట్టించకోకపో వడంతో 25 ఏళ్లుగా మరుగునపడింది.

పాతికేళ్లుగా..: చమురు నిక్షేపాల కోసం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) పాతికేళ్ల క్రితం 1990లో ఏటూరు నాగారం మండలంలో పలు చోట్ల బోర్లు వేసింది. చమురు నిక్షేపాల జాడ లేకపోవడం తో తదనంతర కాలంలో ఓఏన్‌జీసీ తన ప్రయత్నాలు విరమించుకుంది. కానీ, ఓఎన్‌జీసీ వేసిన బోరు బావుల్లో రామన్నగూ డెం దగ్గర వేసిన బోరు నుంచి వేడి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. ఇలా పాతికేళ్లుగా నిర్విరామంగా వేడి నీళ్లు వస్తూనే ఉన్నాయి.

రాపిడి వల్లే..: భూగర్భంలో రాతి సమూహా లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటివి ఉంటాయని భూగర్భ నిపుణులు అంటున్నా రు. ఎలాంటి మానవ ప్రయత్నం లేకుండా నిరంతరం భూమిలో నుంచి నీరు బయటకు రావడాన్ని సాంకేతిక భాషలో ఆర్టిసియన్‌ వెల్‌ (నీట బుంగ) అంటారు. నీరు అధిక పీడనం ఉన్న ప్రాంతం నుంచి అల్పపీడనం వైపునకు ప్రవహిస్తుంది. భూగర్భంలో పీడనం ఎక్కువైన చోట నీరు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుం ది. అనువైన చోట నీరు బయటకు వస్తుంది లేదా ఈæ ప్రాంతాల్లో బోర్లు వేస్తే వీటి ద్వారా ప్రవాహం పైకి వస్తుంది. ఇక్కడ నీరు పైకి రావడంతో పాటు వేడిగా ఉండటం మరో విశేషం. భూగర్భంలో జల ప్రవాహం ఎక్కువ దూరం రాళ్ల మధ్య ప్రవహించడం వల్ల తాకిడికి నీరు వేడిగా ఉండటానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అన్ని పనులు అక్కడే..: బోరు నుంచి వస్తు న్న నీరు... భూమి, చెట్ల వేర్లను ఆనుకొని ప్రవహించడం వల్ల ఎలాంటి దుర్వాసనా ఉండదు. ఎలాంటి రంగు, రుచి లేకుండా స్వచ్ఛంగా ఈ నీరు ఉంటోంది. రామన్నగూడెంలోని వంద కుటుంబాల నీటి అవసరాలు తీరుతున్నాయి. స్థానిక ప్రజలు ఈ నీటిలో దుస్తులు ఉతుక్కోవడం, స్నానాలు చేయడం, సాగు అవసరాలకు వినియోగిం చడం చేస్తున్నారు. ముఖ్యంగా చలి కాలంలో ఇక్కడి వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా స్నానానికి వేడి నీరు లభ్యమవుతోంది.

పట్టించుకోని పర్యాటకశాఖ
రామప్ప, కోటగుళ్లు వంటి చారిత్రక కట్టడాలు, లక్నవరం, బొగత జలపాతం ప్రకృతి అందాలు, డోల్మన్‌ సమాధులు వంటి పురాతన నాగరికత అవశేషాలకు నెలవైన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఉన్న వేడి నీటి ఊటను పర్యాటకశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. బొగత జలపాతానికి వెళ్లే పర్యాటకుల్లో 90 శాతం మంది ఏటూరునాగారం మీదుగా వెళ్తారు. ఇక్కడి నుంచి కేవలం 5 కి.మీ. దూరంలో రామన్నగూడెం పుష్కరఘాట్‌కు వెళ్లే దారి లో ఉన్న వేడి నీటి ఊటకు ప్రాచుర్యం కల్పించేందుకు పర్యాటక శాఖ తరఫున చర్యలు కరువయ్యాయి. స్వదేశీ దర్శన్‌ టూరిజంలో భాగంగా వేడినీటి ఊటకు ప్రాచుర్యం కల్పించాలని ప్రకృతి ప్రేమికులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు