మన్యం గజగజ..! 

11 Nov, 2023 04:13 IST|Sakshi

గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు 

దట్టంగా పొగమంచు 

సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజుజిల్లా): చలికాలం ప్రారంభంలోనే మన్యం ప్రాంతంలో చలిగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. శుక్రవారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 12.5­డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ­బోర్డు వద్ద 13.9డిగ్రీలు, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 14డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ కారణంగా సాయంత్రం నాలుగు గంటల నుంచే చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చలి మరింత వణికిస్తోంది. గిరిజన గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో చలిమంటలు కనబడుతున్నాయి. స్వెట్టర్ల వినియోగం క్రమేణా పెరుగుతోంది. అమ్మకాలు కూడా ఊపందుకుంటున్నాయి.

ఇక అర్ధర్రాతి అయితే దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఘాట్‌ ప్రాంతంలో దీని తీవ్రత ఉధృతంగా ఉంటోంది. ఉదయం 9 గంటల వరకు ఏజెన్సీ ప్రాంతంలో మంచు తెరలు వీడడం లేదు. ప్రజలు హెడ్‌లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు. వ్యవసాయ పనులు, వారపు సంతలకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చలితో ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు