రావు విమర్శల బాకు

28 Dec, 2016 01:48 IST|Sakshi
రావు విమర్శల బాకు

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు మంగళవారం మీడియా ముం దు చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపాయి. ఐఏఎస్‌ అధికారులను కలవరపాటుకు గురి చేశాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవలసింది కాదని వి విధ వర్గాలు ఆయనకు హితవు పలికాయి. రామ్మోహన్‌రావు, ఆయన కుమారుడు వివేక్‌ ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవల ఐటీ అధికారులు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడుల కారణంగా ప్రభుత్వం రామ్మోహన్‌రావును సస్పెండ్‌ చేసి సీఎస్‌ బాధ్యతల నుంచి తొలగించింది. దాడుల అనంతరం రావును, ఆయన కుమారుడిని అరెస్ట్‌ చేస్తారని భావిస్తున్న తరుణంలో గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జయి ఇంటికి చేరుకున్నారు. చెన్నై అన్నానగర్‌లోని తన ఇంటి వద్ద మంగళవారం ఉదయం 10.45 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పరుషపదజాలంతో విమర్శలు గుప్పించడం రాజకీయ కలకలం రేపింది.

తన ఇంటిలో జరిగిన దాడులు చట్ట విరుద్ధమని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం, తనను బదిలీ చేసే ధైర్యం కూడా కేంద్రానికి లేదని సవాలు విసరడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. తన ఇంటిపై ఐటీ దాడులు, సచివాలయంలోని సీఎస్‌ ఛాంబర్‌లో తనిఖీలు, సచివాలయంలోకి సీఆర్‌పీఎఫ్‌ దళాలు ఏమిటని అన్నారు. ముఖ్యమంత్రి జయలలిత  హయాంలో ఇలా జరిగి ఉండేదా అని పదే పదే ప్రశ్నించడం కూడా రాజకీయ వర్గాల వారికి కలవరపాటుకు గురి చేసింది. అసలు అన్నాడీఎంకేకు ఏమైందని ప్రశ్నించడం విశేషం. సచివాలయంలో తనిఖీకి సీఎం పన్నీర్‌సెల్వం అనుమతించారా అని సందేహాన్ని వెలిబుచ్చారు. తనను కొందరు టార్గెట్‌ చేశారు, తనకు వారి వల్ల ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేయడం మరింత కలకలానికి కారణమైంది. కేంద్రానికి తమిళనాడు అన్నా, ఇక్కడి అధికారులనా చిన్నచూపు, అసలు తమిళనాడుకే భద్రత కరువైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకుంటోందని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

మమత, రాహుల్‌కు ధన్యవాదాలు:
సమావేశంలో రావు నోరువిప్పేలోగానే మీడియా పలు ప్రశ్నలు సంధించగా, ఓపిగ్గా ఉండండి చాలా విషయాలు చెప్పాలి అని వారిస్తూ ముందుగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యుడు ఎస్‌ఆర్‌.బాలసుబ్రహ్మణ్యం, పార్టీ అధికార ప్రతినిధి ధీరన్‌లతోపాటు ఐటీ దాడులకు నిరసన తెలిపిన అందరికీ కృతజ్ఞతలు అని అన్న తరువాతనే అసలు అంశానికి రావడం విచిత్రం. ఒక ఐఏఎస్‌ ఉన్నతాధికారిలా కాక రాజకీయ నాయకుడిలా ప్రతిపక్ష నేతలకు ధన్యవాదాలు తెలపడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. రామ్మెహనరావు చేసిన వ్యాఖ్యలు రాబోయే కాలంలో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఐటీ దాడుల తరువాత రావును అరెస్టు చేస్తారని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎటువంటి పరిణామాలకు దోహదం చేస్తుందని ప్రశ్నించుకుంటున్నారు.  

ఐటీ అధికారుల వివరణ
రామ్మెహనరావు ఇంట్లో దాడులు, సోదాలు చేసే అధికారం తమకు ఉందని, వివేక్‌కు, శేఖర్‌రెడ్డికి సంబంధాలు ఉన్నట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని ఐటీ అధికారులు వివరణ ఇచ్చారు. తనిఖీలకు తాము వివేక్‌ పేరుతో వారెంట్‌ పొందాం, ఆ వారెంట్‌ తోనే పదికి పైగా ప్రాంతాల్లో తనిఖీలు చేశామని తెలిపారు. తనిఖీల సమయంలో పారామిలటరీ దళాలను భద్రత కోసం పెట్టుకోకూడదని నిబంధన ఏదీ లేదని అన్నారు. ఇప్పటికే అనేకసార్లు సీఆర్‌పీఎఫ్‌ సేవలను వినియోగించుకున్నామని అన్నారు. రామ్మోహనరావు ఇంట్లో, సచివాలయంలో ఆయన ఛాంబర్‌లో తనిఖీలకు ఢిల్లీ నుంచి అనుమతి పొందామన్నారు. చట్ట ప్రకారమే అన్ని నిర్వహించామని తెలిపారు. రావు ఆరోపణలపై ఐటీశాఖ చీఫ్‌ కమిషనర్‌ కే.శ్రీవాత్సవ బుధవారం మీడియాకు వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. రామ్మోహనరావు చేసిన వ్యాఖ్యలు, విమర్శలపై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖలో ఐటీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మాజీ ఐఏఎస్‌ల విమర్శ
అవినీతి ఊబిలో కూరుకుపోయిన వారు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని మాజీ ఐఏఎస్‌ అధికారి దేవ సహాయం వ్యాఖ్యానించారు. తానింకా ప్రధాన కార్యదర్శిగా చెప్పుకోవడం అవివేకమని అన్నారు. ఒక ఐఏఎస్‌ అధికారిగా ఐఆర్‌ఎస్‌ అధికారుల తీరును ప్రశ్నించడం శోచనీయమన్నారు. మాజీ న్యాయమూర్తి వళ్లి నాయగం మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి చట్టపరంగా తన నిజాయితీ నిరూపించుకోకుండా మీడియా ముందుకెళ్లడం శోచనీయమని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే సభ్యునిలా మాట్లాడుతున్నారని కొందరు ఐఏఎస్‌ అధికారులు ఎద్దేవా చేశారు.

సీఎం సమాధానం చెప్పాలి – స్టాలిన్‌
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తానింకా కొనసాగుతున్నట్లు రామ్మెహనరావు చేసిన వ్యాఖ్యలపై íసీఎం పన్నీర్‌సెల్వం సమాధానం చెప్పాలని డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. అలాగే ఐటీ దాడులపై ఆయన చేసిన విమర్శలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

రాజకీయం చేస్తున్నారు – బీజేపీ
కేంద్రమంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ రామ్మెహనరావు వ్యాఖ్యలతో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు లేవనే విషయం స్పష్టమైందని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్మెహనరావు ఇలా మాట్లాడడం సరికాదని హితవు పలికా>రు. రామ్మెహనరావు వ్యవహారాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం తనను రక్షించే ప్రయత్నం చేయడం లేదని తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొనడం విచిత్రమని అన్నారు. ఒకవేళ తన ఇంటిలో అక్రమంగా ఐటీ దాడులు జరిగి ఉంటే స్పందించాల్సిన తీరు ఇది కాదని అన్నారు. రావు వెనకుండి ఎవరో రెచ్చగొడుతున్నారని ఆమె అనుమానించారు.  రావు వ్యాఖ్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని తమిళ మానిల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీకే వాసన్‌ కోరారు.అన్నాడీఎంకే అధినేత్రి మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో తల దూర్చడానికి బీజేపీ చూపిస్తున్న ఆసక్తి రామ్మెహనరావు వ్యాఖ్యలతో బట్టబయలైంది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని చెప్పడం, ఐటీ దాడులకు పారామిలటరీ దళాలను ప్రయోగించడం వంటివి కొన్ని ఉదాహరణలు. జయలలిత మరణించగానే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడడానికి కేంద్ర ప్రభుత్వ జోక్యమే కారణమని రామ్మెహనరావు చెప్పకనే చెప్పడం గమనార్హం

>
మరిన్ని వార్తలు