లెక్కకు రాని కట్టలు ఎన్నో!

13 Dec, 2023 00:31 IST|Sakshi

రికార్డులు తిరగరాసిన ఉదంతమిది. అయితే అది వన్నె తెచ్చే రికార్డు కాకపోవడమే విషయం. యాభై మంది బ్యాంక్‌ అధికారులు, 40 కౌంటింగ్‌ మిషన్లు, ఆరు రోజుల పాటు అలుపెరగని సోదా, దొరికిన 350 కోట్లకు పైగా నగదు... దేశంలో ఇంతవరకూ ఏ దర్యాప్తు సంస్థ జరిపిన సోదాల్లోనూ కనివిని ఎరుగని కళ్ళు తిరిగే లెక్కలివి. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహూ కుటుంబ డిస్టిలరీ సంస్థపై రాంచీ సహా వివిధ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న దాడులు వారం రోజులుగా వార్తల్లో ముఖ్యాంశమవడానికి ఇదే కారణం. లెక్కింపు మిషన్లు కూడా మొరాయించేలా, గుట్టలు గుట్టలుగా సంచులకొద్దీ డబ్బు ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన సంస్థల్లో దొరకడం సామాన్య ప్రజానీకాన్ని ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది. 

మునుపెన్నడూ లేనంతగా ఒకేసారి ఇంత డబ్బు ఐటీ సోదాల్లో దొరకడం సహజంగానే అధికార పక్షానికి అందివచ్చిన అస్త్రమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టడంలో బీజేపీ నేతలు బిజీ అయ్యారు. సాక్షాత్తూ ప్రధాని, పార్లమెంట్‌ సాక్షిగా హోమ్‌ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోని ప్రసిద్ధ ‘మనీ హైస్ట్‌’ సిరీస్‌ తరహాలో కాంగ్రెస్‌ అవినీతి దోపిడీ సాగుతోందని ప్రధాని వీడియో మీమ్‌లు పెట్టడం కొసమెరుపు. వెరసి, కాంగ్రెస్‌ది కక్కలేని మింగలేని పరిస్థితి.

అయిదుగురు సోదరుల సాహూ కుటుంబమంతా తర తరాలుగా పార్టీ విధేయులూ, వివిధ సమయాల్లో చట్టసభ సభ్యులూ కావడంతో ఆ పార్టీ తప్పించు కోలేని దుఃస్థితి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందీ నడిగడ్డ మీద మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలై, అందులోనూ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి డీలా పడ్డ కాంగ్రెస్‌ను ఇది ఇరుకున పడేసింది. ఈ పరిస్థితుల్లో లెక్కలేని ఈ ధనరాశుల మచ్చ తనపై పడకుండేలా ఆ పార్టీ శతవిధాల యత్నిస్తోంది. బాహాటంగా సాహూను ఏమీ అనకున్నా, ఈ సోదా నగదుపై వివరణ కోరిందన్నది వార్త.  

సోదాల్లో దొరికిన నగదులో అధిక మొత్తం బౌద్‌ డిస్టిలరీస్‌ గ్రూపులో బయటపడ్డదే. అయితే, సాహూ కుటుంబం తరతరాలుగా సారాయి వ్యాపారంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో భారీగా సాగే ఇలాంటి వ్యాపారంలో నగదు చెల్లింపులే ఎక్కువన్నదీ బహిరంగ సత్యమే. పైగా, కుటుంబసంస్థలో కాంగ్రెస్‌ ఎంపీ సాహూ కనీసం డైరెక్టరైనా కాదు. సాహూ కుటుంబ సంస్థ అయినంత మాత్రాన ఆ డబ్బు సాహూది ఎలా అవుతుంది? అంతకు మించి ఆ డబ్బంతా కాంగ్రెస్‌దెలా అయిపోతుంది? ఇదీ హస్తం పార్టీ సమర్థకుల వాదన.

సాంకేతికంగా అది నిజమే! అయితే, ఇందిరా గాంధీ కాలం నుంచి కాంగ్రెస్‌ వెంట నడిచి, ఒకటికి రెండు మూడు సార్లు ఎంపీలైన సాహూ సోదరుడు, సాహూ... తమ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకు తమ వ్యాపార రాబడిని ఆసరాగా చేసుకొని ఉంటారనేది ఊహకందని విషయమేమీ కాదు. అది సాక్ష్యాధారాలతో సంబంధం లేని సామాన్య ఇంగితం. 

ఆరోపణలు, వివరణల మాటెలా ఉన్నా తాజా సాహూ వ్యవహారం మరింత లోతైన వ్యవహారాన్ని సూచిస్తోంది. సమాజంలో పేరు, పలుకుబడి ఉన్న పెద్దమనుషుల వద్ద లెక్కాజమా లేకుండా పోగుపడుతున్న ధనరాశుల చిట్టాలో ఇది లవలేశమేనన్న స్పృహ కలిగిస్తోంది. దాదాపు నూటికి 42 మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బీద రాష్ట్రంలో, నూటికి 48 మంది ప్రజానీకం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న రాష్ట్రంలో ఒక మద్యం డిస్టిలరీ సంస్థ వద్ద ఇంత ధనం దొరకడం సమకాలీన సమాజంలోని విరోధాభాస. సామాన్యులు తమ ప్రతి పైసా ఆదాయానికీ, ఖర్చుకూ లెక్కలు పూచీపడుతుంటే, బడా బాబుల వద్ద లెక్కకందని డబ్బుల కట్టలు మూలుగుతుండడం బయటపడ్డ ప్రతిసారీ దిగ్భ్రాంతి కలిగిస్తూనే ఉంది. పెద్ద నోట్ల రద్దు లాంటి ఆలోచనలు పదేపదే నిష్ఫలమైన తీరునూ కళ్ళ ముందుంచుతోంది.

నిజానికి రాజకీయాలకూ, వ్యాపారానికీ మధ్య బంధం కొత్తేమీ కాదు. విజయ్‌ మాల్యా, అదానీ, అంబానీ అంటూ పేర్లు మారవచ్చేమో కానీ, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనుకూలురితో అధికార పీఠం బంధాలు పెనవేసుకోవడం దశాబ్దాలుగా దేశంలో చూస్తున్నదే. వందల రెట్లలో ఎదుగుతున్న వ్యాపార లెక్కల పైనే కాదు... పీఎం కేర్‌ ఫండ్స్‌ మొదలు పార్టీలకు అందుతున్న విరా ళాలు, ఎలక్టోరల్‌ బాండ్స్‌పైనా రచ్చ రేగుతున్నది అందుకే. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పన్ను లెక్కల్లో చూపని అక్రమ ధనం స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాతా దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉండడం విషాదం. ప్రతి 10–15 ఏళ్ళకోసారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ప్రకటిస్తున్నా నల్ల డబ్బు చీడ తొలగలేదు. చివరకివి ఆర్థికవ్యవస్థనే తలకిందులుచేసే స్థాయికి పెరిగిపోవడం దిగ్భ్రాంతికరం.

డిజిటల్‌ చెల్లింపులు ప్రాచుర్యంలో పెట్టామని జబ్బలు చరుచుకొంటే చాలదు. ఆ పరిధిలోకి రాని ఇలాంటి నగదు గుట్టలను అరికట్టే ప్రణాళికలు చేపట్టాలి. రెండో ప్రపంచ యుద్ధానంతరం కొన్ని దేశాల్లో చేసినట్టే... నిర్ణీత పరిమితి దాటి ఎవరైనా అనధికారికంగా నగదు కలిగివుంటే తక్షణ శిక్షార్హ నేరంగా పరిగణించేలా చట్టం తేవాలి. అధికార పార్టీ నేతలపైనా ఆరోపణలు వినిపిస్తున్న వేళ, తరతమ భేదాలు లేని చర్యలు అవసరం. పైగా, వచ్చే ఎన్నికల్లో అవినీతి అంశాన్ని అస్త్రంగా చేసుకొని ఉరకాలని భావిస్తున్న అధికార పార్టీ నుంచి మరింత జవాబుదారీతనం ఆశిస్తాం. ప్రతిపక్షానికి సైతం తామే కాదు... తమ ఎంపీలూ పులు కడిగిన ముత్యాలేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అవేమీ లేకుండా, సామాన్యులకు చిరకాలం గుర్తుండే ఈ నగదు కట్టల దృశ్యాలు వట్టి వైరల్‌ వీడియోలుగా, శుష్క ఆరోపణలుగా మిగిలిపోతేనే కష్టం.  

>
మరిన్ని వార్తలు