ఆదాయపన్ను రిఫండ్‌లు వేగవంతం

23 Nov, 2023 06:31 IST|Sakshi

89 శాతం మంది అభిప్రాయం ఇదే

సీఐఐ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నుంచి పన్నుకు సంబంధించిన రిఫండ్‌లు గడిచిన ఐదేళ్లలో వేగవంతమయ్యాయి. పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన బకాయిలను ఆదాయపన్ను శాఖ నుంచి వేగంగా పొందుతున్నారు. రిఫండ్‌ కోసం వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గినట్టు సీఐఐ నిర్వహించిన సర్వేలో 89 శాతం మంది వ్యక్తులు, 88 శాతం సంస్థలు చెప్పడం గమనార్హం. ఈ సర్వే వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఐఐ సమరి్పంచింది.

తమ అంచనా పన్ను బాధ్యతకు మించి టీడీఎస్‌ చెల్లించలేదని 75.5 శాతం మంది వ్యక్తులు, 22.4 శాతం సంస్థలు ఈ సర్వేలో చెప్పాయి. రిఫండ్‌ ఏ దశలో ఉందన్న విషయం తెలుసుకోవడం సులభంగా మారినట్టు 84 శాతం మంది వ్యక్తులు, 77 శాతం సంస్థలు తెలిపాయి. ఆదాయపన్ను రిఫండ్‌ క్లెయిమ్‌ సౌకర్యవంతంగా ఉన్నట్టు 87 శాతం మంది వ్యక్తులు, 89 శాతం సంస్థలు చెప్పాయి.

పన్ను ప్రక్రియ ఆటోమేషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న ఎన్నో చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు సీఐఐ ప్రెసిడెంట్‌ ఆర్‌ దినేష్‌ తెలిపారు. ‘‘గడిచిన ఐదేళ్లలో ఆదాయపన్ను రిఫండ్‌లను పొందే విషయంలో వ్యక్తులు, సంస్థలు వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గడం ప్రోత్సాహకరంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న విరామం లేని ఎన్నో చర్యలు ఈ ప్రక్రియను మరింత సులభంగా, సమర్థవంతంగా మార్చేశాయి’’అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు