నిర్ణయం తిరుచ్చిలోనే

21 Dec, 2013 02:13 IST|Sakshi
నిర్ణయం తిరుచ్చిలోనే

 చెన్నై, సాక్షి ప్రతినిధి:
 ఎవరెన్ని ఊహాగానాలు చేసినా, పుకార్లు సృష్టించినా తిరుచ్చిరాపల్లిలో నిర్వహించే పార్టీ సమావేశంలోనే పొత్తులపై తుదినిర్ణయం తీసుకుంటామని డీఎంకే అధినేత కరుణానిధి స్పష్టం చేశారు. చెన్నై అరివాలయంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీతో పొత్తు, కాంగ్రెస్‌తో మళ్లీ చెలిమి వంటి అనేక ఊహాగానాలన్నీ మీడియానే సృష్టిస్తోందని ఆరోపించారు. మీడియా వారు ఇష్టానుసారంగా తన మాటలను మలుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మీడియా అభూతకల్పనలు తనను బాధిస్తున్నాయని చెప్పారు. బీజేపీతో పొత్తు ఉండదని మాత్రం చెప్పగలను అన్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, రాష్ట్ర నేతల వైఖరి ఎడబాటుకు కారణమని చెప్పారు. 2జీ స్పెక్ట్రం కేసులో తమవారిని బలి పశువులను చేసినా, ఈలం తమిళుల సమస్య, తమిళ జాలర్ల సమస్యల్లో తమ వైఖరిని ఎప్పటికప్పుడు స్పష్టం చేసినా కేంద్రం స్పందించలేదని అన్నారు. ఓర్పు నశించి కాంగ్రెస్‌తో ఇక లాభం లేదనే నిర్ణయంతోనే మార్చిలో యూపీఏ నుంచి వైదొలిగామని గుర్తు చేశారు. ఆ తరువాత కూడా కాంగ్రెస్‌తో సంబంధాలు తెగిపోలేదని, ఢిల్లీ నేతలు తనను కలుస్తూనే ఉన్నారని చెప్పారు. అయితే దీనిని రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు సహించలేకపోయారని పేర్కొన్నారు. స్వలాభం కోసం కాంగ్రెస్‌కు డీఎంకే మధ్య అగాథం సృష్టించారని అన్నారు.
 
 డీఎండీకేతో పొత్తుపై ఆయన మాట్లాడుతూ, ఆ పార్టీ అధినేత తమ పార్టీని నానా దుర్భాషలాడారని గుర్తుచేశారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా తప్పనిసరై కోయంబేడు వద్దనున్న వారి కల్యాణమండపాన్ని పాక్షికంగా కూలదోస్తే దారుణంగా విమర్శలు గుప్పించారని తెలిపారు. ప్రభుత్వం నుంచి *8కోట్ల నష్టపరిహారం పొందినతరువాత కూడా డీఎంకేను దూషించడం సహించలేకపోయామని చెప్పారు. వామపక్షాల విషయానికి వస్తే వారు అమ్మ కబంధహస్తాల్లో చిక్కుకుపోయారని కరుణ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులన్నింటినీ పార్టీలోని సీనియర్ నేతలతో కలిసి అధ్యయనం చేస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15, 16 తేదీల్లో తిరుచ్చిలో నిర్వహించబోయే పార్టీ సమావేశంలో పొత్తులపై తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. అంతవరకు లేనిపోని ఊహాగానాల జోలికిపోకుండా మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు