రాయచూరులోనే ఐఐటీ

2 Apr, 2015 01:39 IST|Sakshi

ముఖ్యమంత్రిని కోరిన ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు
 ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేస్తున్న మల్లికార్జున ఖర్గే తదితరులు


బెంగళూరు :  ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు కేటాయించిన ఐఐటీని  వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని రాయచూరులోనే ఏర్పాటు చేయాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జునఖర్గే నేతృత్వంలోని ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విన్నవించింది. ఈమేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణలో  సీఎం సిద్ధరామయ్యను కలిసిన ప్రజా ప్రతినిధులు ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మల్లికార్జున ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ...అత్యంత వెనకబడిన ప్రాంతమైన రాయచూరులో ఐఐటీ స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

నంజుండప్ప నివేదిక ప్రకారం ఐఐటీ ఏర్పాటుకు రాయచూరు అనువైన ప్రాంతమని అన్నారు. మైసూరు, హాసన, మంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఐఐటీ ఏర్పాటుకు డిమాండ్ వస్తుండడంపై మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ...ఇతర ప్రాంతాల్లో ఐఐటీని ఏర్పాటు చేయకండి అని తాము కోరడం లేదని, అదే సందర్భంలో రాయచూరులో ఐఐటీ ఏర్పాటు ఆవశ్యకతను మాత్రమే ముఖ్యమంత్రికి విన్నవించామని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన ప్రజాప్రతినిధుల బృందంలో రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లామ్ తదితరులు ఉన్నారు.
 
 

మరిన్ని వార్తలు