మాతృభాషల్లో ఐఐటీ

22 Dec, 2015 09:09 IST|Sakshi

చెన్నై: తమిళం, తెలుగు, కన్నడం తదితర విద్యార్థులు వారివారి మాతృ భాషల్లో ఐఐటీ ప్రవేశ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని ఎండీఎంకే కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్నికల కసరత్తుకు శ్రీకారం చుడుతూ సోమవారం పార్టీ కార్యవర్గం, అనుబంధ విభాగాల కార్యవర్గాలతో వైగో మంతనాల్లో మునిగారు. ప్రజా కూటమికి నేతృత్వం ఎవరన్న అంశంపై, తమకు పట్టున్న స్థానాల ఎంపికపై నేతల అభిప్రాయాల్ని సేకరించారు.
 
ఎగ్మూర్‌లోని తాయగంలో ఎండీఎంకే రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల కార్యవర్గాల సమావేశం పార్టీ ప్రిసీడి యం చైర్మన్ తిరుపూర్ దురై స్వామి అధ్యక్షతన జరిగింది. రాష్ర్ట వ్యాప్తంగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ వ్యూహాల్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో రచించారని చెప్పవచ్చు. ప్రజా కూటమికి ఎవరు నేతృత్వం వహించాలన్న అంశంపై పార్టీ వర్గాలతో సమాలోచించడమే కాకుండా, తమకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి ఉన్నారు.
 
ఆయా స్థానాల్ని ప్రజా కూటమిలో సీట్ల పందేరం సమయంలో  చేజిక్కించుకోవడంతో పాటుగా, ఆయా ప్రాంతాల్లో పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్న నాయకులు, ప్రజా బలం, ఆర్థిక బలం కల్గిన వారి వివరాలను ఆరా తీసినట్టు సమాచారం. ఆయా స్థానాల్లో ఇప్పటి నుంచే కార్యక్రమాల్ని విస్తృతం చేయడం కోసం వ్యూహాల్ని రచించి ఇచ్చి ఉన్నారు. ప్రజా కూటమిలోకి డీఎండీకే నేత  విజయకాంత్ వచ్చిన పక్షంలో ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే వచ్చే లాభనష్టాల మీద పార్టీ వర్గాల అభిప్రాయాల్ని వైగో స్వీకరించినట్టు తెలిసింది.
 
ఈ సమావేశం అంతా రానున్న ఎన్నికల్ని టార్గెట్ చేసి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా కూటమికి నేతృత్వం వైపుగా సాగినా, చివరకు తాము తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన తీర్మానాలను మీడియాకు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది.  
 
మాతృభాషల్లో పరీక్ష:
ఐఐటీ ప్రవేశ నిమిత్తం తమిళం, తెలుగు, కన్నడం తదితర 22 భాషలకు చెందిన విద్యార్థులు వారి వారి మాతృభాషల్లో పరీక్షలు రాసుకునేందుకు అనుమతి కల్పిస్తూ కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంబరంబాక్కం నీటి విడుదలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తమిళనాడులో నెలకొన్న పరిణామాలను జాతీయ విపత్తుగా ప్రకటించి,ప్రజల్ని ఆదుకునేందుకు రూ.50 వేల కోట్లను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.

హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నది పరివాహక, చెరువులు తదితర ప్రాంతాల్లోని ఆక్రమణలను ఆగమేఘాలపై తొలగించాలని డిమాండ్ చేశారు. జల్లికట్టుకు త్వరితగతిన అనుమతి మంజూరు చేయాలని, అందుకు తగ్గ చర్యల్ని కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వేగవంతం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు