వర్షాకాలంలోనూ ట్యాంకర్లతో నీటి సరఫరా

22 Aug, 2015 03:07 IST|Sakshi
వర్షాకాలంలోనూ ట్యాంకర్లతో నీటి సరఫరా

♦ రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం కన్నా తక్కువ సగటు వర్షపాతం
♦ ఎండిపోయిన ‘ఖరీఫ్’, నిండుకోని జలాశయాలు
♦ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటికి తీవ్ర సమస్యే
 
 సాక్షి, ముంబై : భవిష్యత్తులో రాష్ట్రం తీవ్ర నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వర్షపాతం 50  శాతం కంటే  తక్కువగా నమోదయ్యింది. వర్షాభావంతో ఖరీఫ్ పంటలు పూర్తిగా ఎండిపోయాయి. జలాశయాల్లోని నీటి మట్టాలు కనీసం 50 శాతం కూడా నిండుకోలేదు. దీంతో వర్షకాలంలో కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తాగు నీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. వరుణుడు కాస్తా కరుణించినా ఊరట లభించే అవకాశాలున్నాయి.

రాష్ట్రంలోని 36 జిల్లాలకుగాను 17 జిల్లాల్లో జూన్ నుంచి ఇప్పటి వరకు సగటు కంటే 50 శాతం తక్కువ  వర్షపాతం నమోదయ్యింది. నాసిక్, షోలాపూర్, లాతూర్, బీడ్, పర్భణీ మొదలగు జిల్లాల్లో 30 శాతం కూడా వర్షపాతం నమోదు కాలేదు. షోలాపూర్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా కేవలం 15.6 శాతం వర్షపాతం నమోదయ్యింది. ఇక రాయిగడ్, సింధుదుర్గా, జల్/గావ్, ఔరంగాబాద్, జాల్నా, హింగోలి, చంద్రాపూర్ జిల్లాల్లో 50 శాతానికి అటుఇటుగా నమోదయ్యింది. ఈ సారి నాగపూర్ జిల్లాల్లో అత్యధికంగా 76 శాతం వర్షపాతం నమోదుకాగా పుణే జిల్లాల్లో 51.9 శాతం నమోదైంది.

 ట్యాంకర్లతో నీటి సరఫరా
 వర్షాభావం కారణంగా నీటి సరఫరా చేసేందుకు ట్యాంకర్లను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని 1,421 గ్రామపంచాయతీలు, 2,509 పల్లెలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. మొత్తం 1,820 ట్యాంకర్లలో ఒక్క మరాఠ్వాడా ప్రాంతాల్లోని గ్రామాలకే 1,200 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఈ పరిస్థితిని బట్టి మరాఠ్వాడాలో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది. జలాశయాల్లోన్నింటిలో ప్రస్తుతం 47 శాతం నీటి నిల్వలున్నాయి. ప్రాంతాల వారిగా పరిశీలిస్తే మరాఠ్వాడాలో కేవలం ఎనిమిది శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి.

 మరాఠ్వాడాలో 8 శాతమే..
 రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల మరాఠ్వాడాలోని డ్యాంలలో ఎనిమిది శాతం మాత్రమే నీరు మిగిలింది. రాష్ట్రంలో శుక్రవారం 1.1 మిమి వర్షపాతం నమోదవగా.. నాసిక్, ధులే, జల్గావ్, అహ్మద్‌నగర్, ఔరంగాబాద్, జల్నా, ముల్‌ధనా, అకోలా, వాసిమ్‌లలో అసలు వర్షపాతం నమోదవలేదు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రంలో సగటు వర్షపాతం 205.5 మిమి కాగా, గురువారం వరకు రాష్ట్రంలో 130.9 మిమి వర్షపాతం నమోదైంది.

జూన్ నుంచి రాష్ట్రంలో 831.4 మిమి వర్షపాతం నమోదవాల్సి ఉండగా 493 మిమి నమోదైంది. గతేడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 525.5 వర్షపాతం నమోదైందని సీఎం కార్యాలయం పేర్కొంది. రాష్ట్రంలోని 2,229 రిజర్వాయర్లలో 18,018 టీఎంసీల నీరు (మొత్తం కెపాసిటీలో 48 శాతం) నిలువ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2013లో మరాఠ్వాడాలో వర్షపాతం 44 ఉండగా గతేడాది 18 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వర్షపాతం 8 శాతానికి చేరింది.

మరిన్ని వార్తలు