నైరుతి వానలన్నీ పడ్డట్టే!

7 Sep, 2023 03:13 IST|Sakshi

మొత్తం సీజన్‌ సాధారణ వర్షపాతానికి సరిపడా ఇప్పటికే కురిసిన వానలు

సెప్టెంబర్‌ 30 వరకు కురవాల్సింది 72.1 సెంటీమీటర్లు..

ఇప్పటికే కురిసినది 74.35 సెంటీమీటర్లు

ఇకపై రాష్ట్రంలో పడేదంతా అధిక వర్షపాతమేనన్న వాతావరణ నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి వర్షపాతం సంతృప్తికర స్థాయికి చేరింది. మొత్తం సీజన్‌లో పడాల్సిన సాధారణ వర్షపాతం అంతా ఇప్పటికే నమోదైంది. ఇకపై రాష్ట్రంలో కురిసే వర్షాలన్నీ అధిక వర్షాలుగా పరిగణించవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.

ఏటా జూన్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వరకు ఉన్న కాలాన్ని నైరుతి రుతపవనాల సీజన్‌గా పేర్కొంటారు. ఈ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో 72.10 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవుతుంది. అదే ఈసారి ఇప్పటికే (సెప్టెంబర్‌ 6 నాటికే) 74.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 1.03 శాతం ఎక్కువగానే పడింది. ఇకపై కురిసే వానలన్నీ అదనంగా కురిసే వానలేనని చెప్తున్నారు.

కొంత కలవరపెట్టినా..
నిజానికి ఈసారి నైరుతి సీజన్‌ వర్షాలు ఆలస్యంగా మొద­లయ్యాయి. జూన్‌ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను చూసి రైతులు ఆందోళన చెందారు. పంటల సాగు కూడా ఆలస్యమైంది. అయితే జూలై మొదటి నుంచే పరిస్థితి మారిపోయింది. ఏకంగా రెట్టింపు వర్షపాతం నమోదైంది. మళ్లీ ఆగస్టులో లోటు వర్షపాతం నమోదవగా.. సెప్టెంబర్‌లో వానలు ఊపందుకున్నాయి.

గతేడాది 40శాతం అధికంగా..
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నైరుతి సీజన్‌ వర్షపాతం అధికంగానే నమోదవుతూ వస్తోంది. 2021లో ఏకంగా 49శాతం అధిక వర్షపాతం నమోదుకాగా.. 2022లో 40శాతం అధికంగా (100.97 సెంటీమీటర్లు) వానలు పడ్డా­యి. ఈ ఏడాది ఇప్పటికే 74.35 సెంటీమీటర్లు కురవగా.. నెలాఖరు నాటికి ఎంత వర్షపాతం నమో­దవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా గణనీయంగానే అధిక వర్షపాతం నమోదుకావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

నాలుగు జిల్లాల్లో సాధారణంగా..
రాష్ట్రవ్యాప్తంగా వానలు పడటంతో జిల్లాల వారీగా కూడా లోటు వర్షపాతం లేకుండా పోయింది. అయితే నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మాత్రం వర్షపాతం కాస్త తక్కువగా, మిగతా జిల్లాల్లో 20శాతం కంటే అధికంగా నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సిద్దిపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం, 22 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవగా.. మిగతా 10 జిల్లాలు సాధారణ వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి.

నేడు, రేపు మోస్తరు వానలు
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతా­వరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలహీనపడిందని.. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రెండ్రోజుల పాటు వానలు పడతాయని పేర్కొంది. 

మరిన్ని వార్తలు