గోవిందా బృందాలకు బీమా!

16 Aug, 2013 23:12 IST|Sakshi

సాక్షి, ముంబై: బీమా సౌకర్యం పొందేందుకు గోవిందా బృందాలు ఓరియంటల్ బీమా కార్యాలయాలవద్ద బారులు తీరుతున్నాయి. గతం కంటే ఈ సారి బీమా చేయించుకునే బృందాల సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బృందాలను స్పాన్సర్ చేసేందుకు అనేక కంపెనీలు, రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి.
 
 దీంతో ముంబై, ఠాణే, నవీముంబై, పుణే, నాసిక్ లాంటి ప్రధాన నగరాలలో గోవిందా బృందాలకు ఉచితంగా బీమా సౌకర్యం పొందేందుకు అవకాశం లభించింది. శ్రీకృష్ణ జన్మాష్టమి (ఉట్టి ఉత్సవం) కి దాదాపు రెండు వారాల సమయం ఉంది. ఇప్పటి వరకు సుమారు 289 సార్వజనిక గోవిందా బృందాలు అంటే 26,248 మంది సభ్యులు బీమా చేయించుకున్నారు. వీరికి రిహార్సల్ మొదలుకుని ఉట్టి ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు బీమా వర్తిస్తుంది. గత ఐదేళ్లుగా ఓరియంటల్ బీమా కంపెనీ ఈ సంఘాలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. అందుకు ఒక్కొక్కరికి రూ.30 చెల్లించాల్సి ఉంటుంది.
 
 అయితే ఈ ఏడాది స్పాన్సర్లు ముందుకు రావడంతో ఈ గోవిందా మండళ్లకు ఉచితంగానే బీమా పొందే అవకాశం లభించింది. కుర్లా ప్రాంతానికి చెందిన శివసేన నాయకుడు అజయ్ బడ్గుజర్ తన బడ్గుజర్ ఫౌండేషన్ తరఫున ఇప్పటివరకు 110 గోవిందా బృందాలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించారు. అదేవిధంగా మంగల్‌ప్రభాత్ లోఢాకు చెందిన లోఢా చారిటబుల్ ట్రస్టు, ముంబై బీజేపీ కూడా స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చాయి. దిండోషీ ప్రాంతంలోని గోవిందా బృందాలకు బీమా కల్పించాయి. కాగా 29 గోవిందా బృందాలు స్వయంగా ప్రీమియం చెల్లించి బీమా పాలసీ తీసుకున్నాయని ఓరియంటల్ బీమా కంపెనీ పరిపాలన అధికారి సచిన్ ఖాన్వీల్కర్ చెప్పారు. ఆగస్టు 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కేవలం రూ.30  ప్రీమియంతో రూ.లక్షకుపైగా విలువచేసే బీమా కల్పించడంతో గోవిందా బృందాలు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నాయని ఖాన్వీల్కర్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు