మలైస్వామిపై వేటు వేసిన జయ

15 May, 2014 15:51 IST|Sakshi

చెన్నై: అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి మరోసారి తన తడాఖా చూపించారు. మాజీ ఎంపీ మలైస్వామిని ఆమె గురువారం పార్టీ నుంచి బహిష్కరించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితే ఆయనతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తామన్న మలైస్వామి వ్యాఖ్యలపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిబంధనలను అతిక్రమించారన్న కారణంతో ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.

ఇక నుంచీ మలైస్వామితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని పార్టీ సభ్యులకు కూడా ఆమె ఆదేశాలు జారీ చేశారు. గతంలో తమిళనాడు ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన మలైస్వామి.. 1999లో అన్నాడీఎంకేలో చేరారు. దక్షిణ చెన్నైలో పార్టీ కార్యకలాపాలను ఆయన చూసేవారు. మోడీ ప్రధాని అయితే మళ్లీ ఎన్డీయే పంచన చేరతారన్న వార్తలు వస్తున్నా మరోవైపు జయలలిత మాత్రం దీనిపై పెదవి విప్పటం లేదు.
 

మరిన్ని వార్తలు