వరద సాయం ఏదమ్మా?

21 Jan, 2016 03:17 IST|Sakshi

చెన్నై, సాక్షి ప్రతినిధి:   ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు వీలుగా అమ్మ కాల్‌సెంటర్లను సీఎం జయలలిత మంగళవారం ప్రారంభించారు. 1100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను నమోదుచేసుకోవచ్చని జయ తెలిపారు. ఒక రోజుకు 15వేల సమస్యలను నమోదు చేసేందుకు వీలుగా 138 మంది సిబ్బందిని కాల్‌సెంటర్‌లో నియమించారు. ఈ కాల్‌సెంటర్లు బుధవారం నుండి వాడుకలోకి వచ్చాయి. తొలిరోజైన బుధవారం నాడు వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ సుమారు 2వేల ఫోన్ కాల్స్‌రాగా వీటిల్లో ఎక్కువశాతం వరద సహాయం గురించినవని సిబ్బంది తెలిపారు. 30 లక్షల మందికి పైగా వరద సహాయం అందుతుందని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందులో కొందరికి వరద సహాయం అందింది. పండుగ సమయాల్లో వరద సహాయకాల పంపిణీకి బ్రేకు పడింది.  వరద సహాయం పొందని వారంతా అమ్మ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఎపుడు అందిస్తారని ప్రశ్నించారు.
 
 విమర్శలు: తమిళనాడు ప్రభుత్వం తరపున అట్టహాసంగా ప్రారంభమైన అమ్మ కాల్‌సెంటర్ ఆరంభంలోనే హంసపాదుగా మారిందనే విమర్శలు సైతం వినపడ్డాయి. ప్రతిరోజూ 24 గంటలపాటు సేవలందిస్తామని ప్రభుత్వం ప్రకటించగా రెండో రోజునే అపసవ్యంగా మారిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. 1100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే ‘ ఈ ఫోన్ నెంబరు అందుబాటులో లేదు’ అంటూ సమాచారం వచ్చిందని కొందరు పేర్కొన్నారు. ప్రజల చెవిలో పూలుపెట్టే చర్యని డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఎద్దేవా చేశారు.
 

మరిన్ని వార్తలు