అమ్మ ఖర్చు 24 లక్షలు

19 Aug, 2016 09:04 IST|Sakshi
అమ్మ ఖర్చు 24 లక్షలు

కరుణ రూ. 25 లక్షలు
కెప్టెన్ రూ.16 లక్షలే
ఎన్నికల ఖర్చు
 
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుల లెక్కల్ని ఎన్నికల యంత్రాంగం తేల్చింది. డీఎంకే అధినేత కరుణానిధి, దళపతి స్టాలిన్ రూ. 25 లక్షలు చొప్పున ఖర్చు పెడితే, అమ్మ, సీఎం జయలలిత రూ. 24 లక్షల 55 వేల 631గా లెక్క తేల్చారు.  2016 అసెంబ్లీ ఎన్నికల సమరం ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. అధికారం ఎవరిదో అన్నది అంతు చిక్కని రీతిలో సాగి, చివరకు రాష్ర్ట ఓటర్ల మళ్లీ అమ్మకే పట్టం కట్టారు.
 
అదే సమయంలో రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా బలమైన ప్రధాన ప్రతి పక్షంలో డీఎంకేను కూర్చోబెట్టారు. ఇంత వరకు అన్నీ బాగానే సాగినా, ఎన్నికల అనంతరం అభ్యర్థుల లెక్కల మీద ఈసీ దృష్టి పెట్టింది. 234 స్థానాల్లో రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడగా, మిగిలిన స్థానాల బరిలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల లెక్కల్ని పరిశీలించి తేల్చారు. ఈ ఎన్నికల్లో ఎన్ని కూటములు ఉన్నా, ప్రధాన సమరం డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సాగింది.  
 
ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థులందరి వివరాల సేకరణ సాగినా, ప్రధాన దృష్టి లెక్కల పరిశీలనలో ఆ రెండు పార్టీల మీద సాగి తేల్చారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చుగా రూ.25 లక్షల వరకు వినియోగించుకునేందుకు తగ్గ అవకాశాల్ని ఎన్నికల యంత్రాంగం కల్పించింది. ఈ లెక్కల పరిశీలనకు ప్రత్యేక నిఘా బృందాలు సైతం రంగంలోకి దిగాయి. ఈసీ లెక్కలు మొక్కుబడే అయినా, లెక్కలోకి రాని రీతిలో ఎన్నికల్లో నోట్ల కట్టలు చల్లారన్న విషయం జగమెరిగిన సత్యం. ఇందుకు ఉదాహరణ వాయిదా పడ్డ తంజావూరు, అరవకురిచ్చిలను పరిగణించ వచ్చు.
 
 లెక్కలోకి రాని నోట్ల కట్టల్ని పక్కన బెడితే, ఈసీ నియమ నిబంధనలకు లోబడి అభ్యర్థులు పెట్టిన ఖర్చుల లెక్కలు ఎలాగో తేలాయి. ఆ మేరకు ఆర్‌కే నగర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన అమ్మ జయలలిత రూ. 24 లక్షల 55 వేల 631 ఖర్చు పెట్టారు. ఇక, తిరువారూర్‌లో పోటీ చేసి గెలిచిన  డీఎంకే అధినేత కరుణానిధి, కొళత్తూరు నుంచి పోటీ చేసి గెలిచిన స్టాలిన్ తలా రూ.25 లక్షలు ఖర్చులు పెట్టినట్లు లెక్కల్ని సక్రమంగా సమర్పించి ఉన్నారు.
 
 ఇక, గత ఎన్నికల్లో ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించి, సీఎం కావాలన్న ఆశతో ఉలందూరు పేట నుంచి రేసులో నిలబడి ఘోరంగా దెబ్బ తిన్న డీఎండీకే అధినేత విజయకాంత్ కేవలం 16 లక్షల 70 వేలు మాత్రమే ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఉన్నారు. ఈయన తన ఖర్చు కాస్త పెంచి ఉంటే, గెలిచి ఉంటారేమో..!. కాట్టుమన్నార్ కోవిల్ నుంచి పోటీ చేసి 80 ఓట్లతో ఓటమి చవిచూసిన వీసీకే నేత తిరుమావళవన్ పదిహేను లక్షలతో సరి పెట్టారు. ఇక, తానే సీఎం అన్నట్టుగా ప్రచార సమయాల్లో ధీమా వ్యక్తం చేసిన పీఎంకే అన్భుమణి రాందాసు 19 లక్షలు ఖర్చు పెట్టినట్టు ఎన్నికల కమిషన్‌కు వివరాల్ని సమర్పించడం విశేషం. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ సమర్పించిన వివరాల్ని పరిశీలించి లెక్కల్ని కేంద్ర ఎన్నికల కమిషన్ తేల్చింది. ఇందుకు తగ్గ వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో గురువారం ప్రకటించారు.  
 
 ఈసీకీ నోటీసు :
 లెక్కలు ఓ వైపు తేలి ఉంటే, మరో వైపు గెలిచిన వాళ్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై వివరణకు ఈసీకి నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో అమ్మ జయలలిత గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కూడా ఉంది. ఆర్‌కే నగర్‌లో భారీగా అవకతవకలు జరిగాయని, నోట్ల కట్టలు పారి, అవినీతితో  విజయం సొంతం చేసుకున్నట్టు అమ్మ జయలలితకు వ్యతిరేకంగా ప్రవీణ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన  పిటిషన్‌ను విచారణకు న్యాయమూర్తి దురై స్వామి స్వీకరించారు.
 
 అమ్మ జయలలితతో పాటు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ అయ్యాయి. ఇక, 80 ఓట్లతో విజయాన్ని దూరం చేసుకున్న వీసీకే నేత తిరుమావళవన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి దురై స్వామి పరిగణలోకి తీసుకున్నారు. ఓట్ల లెక్కింపులో చోటు చేసుకున్న అవినీతితో అన్నాడీఎంకే అభ్యర్థి మురుగు మారన్ గెలిచినట్టు అధికారులు ప్రకటించారని తిరుమా దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందించిన న్యాయమూర్తి దీనికి కూడా వివరణ ఇవ్వాలని ఈసీకి ఆదేశాలు జారీ చేశారు.
 

>
మరిన్ని వార్తలు