నా వ్యాఖ్యలను బీజేపీ తప్పుదారి పట్టించింది: ఉదయనిధి

4 Dec, 2023 16:32 IST|Sakshi

చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. తన వ్యాఖ్యలను పెద్దవిగా చేసి దేశమంతా విస్తరించేలా చేశారని ఆరోపించారు. మారణహోమానికి పిలుపునిచ్చానని పేర్కొంటూ తన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుదారి పట్టించారని విమర్శించారు. సనాతన ధర్మాన్ని కరోనా, డెంగ్యూతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

సనాతన ధర్మంపై తాను వ్యాఖ్యలను మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తప్పుదారి పట్టించారని ఆరోపించిన ఉదయనిధి స్టాలిన్.. “నేను మారణహోమానికి పిలుపునిచ్చానని మోదీ అన్నారు. కానీ నేను చెప్పని విషయాలను ఆయన అన్నారు. నేను ఒక సమావేశంలో పాల్గొని మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడాను. ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంలో వివక్షను రూపుమాపాలి అని మాత్రమే నేను మాట్లాడాను.  కానీ దాన్ని వక్రీకరించి పెద్దది చేసి యావత్ భారతదేశం నా గురించి మాట్లాడుకునేలా చేశారు." అని ఉదయనిధి అన్నారు. 

 “ఓ సాధువు నా తలపై 5-10 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టులపై నమ్మకం ఉంది. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని నన్ను అడిగారు. క్షమాపణ చెప్పలేనని చెప్పాను. నేను స్టాలిన్ కొడుకుని, కలైంజ్ఞర్ మనవడిని, నేను వారి భావజాలాన్ని కొనసాగిస్తాను." అని ఉదయనిధి తెలిపారు.

‘తమిళనాడు ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’..  ‘సనాతన నిర్మూలన’ పేరుతో సెప్టెంబర్‌లో నిర్వహించిన సమావేశంలో  ఉదయనిధి స్టాలిన్‌  హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, కరోనాతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.   

ఇదీ చదవండి: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్ ఎత్తివేత

>
మరిన్ని వార్తలు