సస్పెన్షన్ రగడ

19 Aug, 2016 08:55 IST|Sakshi

నిరసనలతో దద్దరిల్లిన జార్జ్‌కోట
స్పీకర్ తీరుపై సర్వత్రా ఆగ్రహం
దిష్టిబొమ్మల దహనం, ఆందోళనలు
22న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు డీఎంకే పిలుపు
ప్రత్యేక ప్రసారానికి భయం ఏల...?కరుణ, స్టాలిన్‌ల ప్రశ్న

 
డీఎంకే సభ్యుల సస్పెన్షన్  వ్యవహారం నిరసనలకు దారి తీశాయి. స్పీకర్ ధనపాల్ తీరును ఖండిస్తూ రాజకీయ  పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డీఎంకే సభ్యులు ఏకంగా జార్జ్‌కోట అసెంబ్లీ ఆవరణలోని నాలుగో నంబర్  గేటు వద్ద ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రత్యేక ప్రసారాలకు భయం ఎందుకో అని ప్రభుత్వాన్ని డీఎంకే అధినేత కరుణానిధి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు.
 
చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం చోటు చేసుకున్న పరిణామాలతో డీఎంకే సభ్యులు మెజారిటీ శాతం మందిపై వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు పడ్డ విషయం తెలిసిందే. ఐదారుగురు డీఎంకే సభ్యులు సభకు రాని దృష్ట్యా, వారు మాత్రం సస్పెన్షన్ వేటుకు గురి కాలేదు. వీరిని  మాత్రం గురువారం సభలోకి అనుమతి ఇచ్చారు. మిగిలిన వారు జార్జ్‌కోటలోకి  అడుగు పెట్టకుండా, అడ్డుకునేందుకు తగ్గట్టుగా అధికార పక్షం సర్వం సిద్ధం చేసింది.
 
అసెంబ్లీ సమావేశ మందిరంలోకి కాకుండా, తన చాంబర్‌కు ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లేందుకు ఉదయం తొమ్మిదిన్నర, పది గంటల సమయంలో ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ వచ్చారు. నాలుగో నంబర్ గేట్ ప్రవేశ మార్గం వద్ద వారిని లోనికి అనుమతించకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. తాము అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా వారం రోజులు సస్పెన్షన్ విధించారేగానీ, తమ చాంబర్లకు వెళ్ల కూడదన్న నిబంధనలు లేదంటూ మార్షల్స్‌ను నిలదీశారు. తమ చాంబర్‌కు వెళ్లేందుకు అధికారం ఉందని వారించినా మార్షల్స్ అనుమతించలేదు.
 
దీంతో ప్రవేశ మార్గంలో డతఎంకే సభ్యులు అందరూ బైటాయించడంతో ఉత్కంఠ నెలకొంది. తమను అనుమతి కల్పించాలని డిమాండ్ చేస్తూ, డీఎంకే వర్గాలు నిరసనకు దిగడంతో  ఆగమేఘాలపై జార్జ్‌కోటలో భద్రతను పోలీసు యంత్రాంగం కట్టుదిట్టం చేసింది. వీరిని నిరసన నినాదాలతో జార్జ్ కోట దద్దరిల్లింది. సుమారు గంటన్నర పాటు ప్రవేశ మార్గంలో డీఎంకే సభ్యులు బైఠాయించి నిరసన తెలియజేసినానంతరం మీడియా ముందుకు వచ్చారు. స్టాలిన్ మాట్లాడుతూ తమను సస్పెండ్ చేస్తూ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను వివరించారు.
 
ఇందులో కేవలం సభా వ్యవహారాల్లో పాల్గొనేందుకు వీలు లేదని స్పష్టంచేశారేగానీ, సచివాలయంలో ఎక్కడికైనా వెళ్లేందుకు తనకు అనుమతి ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కేబినెట్ హోదా కల్గిన తనను తన చాంబర్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

దీన్ని బట్టి చూస్తే ఏ మేరకు పాలకుల సభలో ప్రతి పక్షానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. సభలో తమకు వ్యతిరేకంగా సాగే వ్యవహారాలకు సమాధానాలు ఇచ్చుకునే అవకాశాన్ని స్పీకర్‌కు ఇవ్వడం లేదని మండి పడ్డారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తే సభలో తప్పులు చేస్తున్నదెవరో బయట పడుతుందన్నారు. ఆ భయంతో ప్రసార వ్యవహారంలో వెనక్కు తగ్గుతున్నారని విమర్శించారు.
 
నిరసనల హోరు :
తమ పార్టీ సభ్యుల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ డీఎంకే వర్గాలు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనకు దిగారు. స్పీకర్ దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. ధర్మపురి, కోయంబత్తూరు, ఈరోడ్‌లలో అయితే, నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. దిష్టిబొమ్మల దహనం ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్యుద్ధం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఇక, స్పీకర్ తీరును సర్వత్రా ఖండిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రధాన ప్రతి పక్షం, ఇతర ప్రతిపక్ష సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
 
తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, సీపీఎం నేత జి. రామకృష్ణన్, బీజేపీ నేత తమిళి సై సౌందరరాజన్ స్పీకర్ తీరును ఖండిస్తూ, సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఇక , డీఎంకే అధినేత ఎం కరుణానిధి మాట్లాడుతూ... తమ పార్టీ శాసనసభ సభ్యులతో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి చర్యలు తీసుకుంటే, సభలో ఎవరి తీరు ఏమిటో స్పష్టం అవుతుందన్నారు. డీఎంకే సభ్యుల సస్పెన్షన్‌ను ఖండిస్తూ ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది.

>
మరిన్ని వార్తలు