జికా ఫీవర్‌

12 Jul, 2017 04:25 IST|Sakshi
జికా ఫీవర్‌

♦ అధికారవర్గాల అప్రమత్తం
♦ ఆందోళన వద్దన్న ప్రభుత్వం
♦ సీజన్‌ జ్వరాలపై దృష్టి
♦ ఆస్పత్రుల్లో అన్ని రకాల మందుల నిల్వ


రాష్ట్ర ప్రజల్లో జికా భయం బయలుదేరింది. రాష్ట్రంలోకి ఈ జ్వరం ప్రవేశించిన సమాచారంతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వరాలకు తగ్గ అన్ని మందుల్ని పూర్తిస్థాయిలో నిల్వ ఉంచారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్‌ భరోసా ఇచ్చారు.

సాక్షి, చెన్నై :  డెంగీ, స్వైన్‌ ఫ్లూ, చికున్‌ గున్యా వంటి జ్వరాలతో భయపడుతున్న రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుతం జికా ఆందోళన బయలు దేరింది. కొన్నేళ్లుగా నైరుతి రుతు పవనాల రూపంలో రాష్ట్రంలో వర్గాలు అంతంత మాత్రమే. అడపాదడపా, చెదురుమదురుగా అక్కడక్కడ పడే వర్షం రూపంలో తయారయ్యే మురికిగుంటలే కాదు, అపరిశుభ్రత కారణంగా బయలుదేరే దోమల రూపంలో ఇటీవల కాలంగా కొత్త కొత్త జ్వరాలు ప్రజల్ని భయపెడుతున్నాయి.  ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు వేల మందికి పైగా డెంగీ భారిన పడటం, ఇందులో 34మంది మరణించిన నేపథ్యంలో విదేశాల్లో వణికించిన జికా రాష్ట్రంలోకి ప్రవేశించిన సమాచారం అధికార వర్గాల్ని ఉరుకులు తీయించింది.

జికా భయం
చిన్నపాటి సీజన్‌ జ్వరాలు వస్తే చాలు ప్రజలు వణికి పోతుంటారు. డెంగీ, మలేరియా, స్వైన్‌ ఫ్లూ, చికున్‌ గున్యా వంటి జ్వరాలను ప్రత్యక్షంగా చూసిన జనంలో ఇప్పుడు జికా పేరు మార్మోగుతుండడంతో ఆందోళన రెట్టింపు అవుతోంది. కృష్ణగిరి జిల్లా నాట్రాం పాళయంలో 27 సంవత్సరాల యువకుడు, పక్క జిల్లాలో మరొకరు జికా బారిన పడ్డ సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా భయం బయలుదేరింది. నాట్రాం పాళయం యువకుడికి జికా నిర్ధారించినట్టు, అతడికి అక్కడి ఆరోగ్యకేంద్రంలో ప్రత్యేక చికిత్స అందించడం ద్వారా జ్వర తీవ్రత తగ్గుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతుండడంతో, అప్రమత్తం అంటూ సూచనలు సలహాలు ఇచ్చే పనిలో వైద్యులు నిమగ్నమయ్యారు. జ్వరం, కళ్లు మండడం, దురదలు, కళ్లు ఎరుపుగా మారడం, మోకాళ్ల నొప్పులు, నీరసం వంటి జికా జ్వరానికి లక్షణాలు అని సూచిస్తున్నారు. చిన్నపాటి జ్వరం వచ్చినా వైద్యుల్ని సంప్రదించి చికిత్స పొందాలని సలహా ఇస్తున్నారు.

ఆందోళన వద్దు
జికా రాష్ట్రంలోకి ప్రవేశించిన సమాచారంతో ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, హెల్త్‌ సెంటర్లలో వైద్య సిబ్బంది 24 గంటల పాటుగా తప్పనిసరిగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ జికా భయం అసెంబ్లీని సైతం తాకింది. మంగళవారం అసెంబ్లీలో ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్‌ జికాపై ఆందోళన వద్దు అని ప్రజలకు భరోసా ఇచ్చారు. వైద్య శాఖను అప్రమత్తం చేశామన్నారు. జికా అన్నది నిర్ధారణ కావాల్సి ఉన్నా, ఆ లక్షణాలతో ఆస్పత్రిలో ఉన్న ఇద్దరికి మెరుగైన చికిత్సఅందిస్తున్నామని వివరించారు. మూరుమాల గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో సైతం ఎల్లవేళళా చికిత్సలు అందే రీతిలో అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. పుష్కలంగా మందులున్నాయని, ఈ జ్వరం ప్రాణాల మీదకు వచ్చే ప్రసక్తేలేదని, ఆదిలోనే తుంచిపడేసే రీతిలో ముందుకు సాగుతామని, ప్రజలు ఆందోళన వీడాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయని, వాతావరణంలో మార్పుల దృష్ట్యా వచ్చే సీజన్‌ జ్వరాలకు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో  ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందే రీతిలో చర్యలు తీసుకున్నామని, కొత్త ఆదేశాలను కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు