కరుణ వైపు చూపు

4 Mar, 2016 09:45 IST|Sakshi
కరుణ వైపు చూపు

*తమీమున్ రెడి
*కార్తీక్ కూడా
*దరిదాపుల్లో విజయకాంత్

చెన్నై:  రానున్న ఎన్నికల్లో డీఎంకే అధినేత ఎం కరుణానిధి వెంట పయనం సాగించేందుకు మరికొన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఇందులో మనిద నేయ జననాయగ కట్చి, అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి ఉన్నాయి. డీఎండీకే నేత విజయకాంత్ దరిదాపుల్లోకి చేరుకుని ఉన్నా, తుది నిర్ణయాన్ని సస్పెన్షన్‌లో పెట్టి ఉన్నారు.


 అధికారం లక్ష్యంగా తీవ్ర వ్యూహాలతో ముందుకు సాగుతున్న డీఎంకేతో పొత్తుకు కాంగ్రెస్ ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. పాత స్నేహం మళ్లీ చిగురించడంతో ఇక, సీట్ల పందేరం కొలిక్కి రావాల్సి ఉంది. ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ డిఎంకే వెంటే పయనం కొనసాగించేందుకు నిర్ణయించింది.

మరికొన్ని చిన్న పార్టీలు కరుణ వెంట నడిచేందుకు సిద్ధం కాగా, ప్రస్తుతం మరికొన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి. ఇందులో తమీమున్ అన్సారి నేతృత్వంలోని మనిద నేయ జననాయగ కట్చి, సినీ నటుడు కార్తీక్ నేతృత్వంలోని అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి ఉన్నాయి. ఎంఎంకేను చీల్చి తన బలాన్ని చాటుకునేందుకు తమీమున్ అన్సారి పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో చెన్నై వేదికగా మైనారిటీ సామాజిక వర్గం తన వెంటే అని చాటుకునే విధంగా భారీ మహానాడుకు తమీమున్ అన్సారీ కార్యచరణలో పడ్డారు.

ఇక, తన తొలి పయనాన్ని డీఎంకేతో కలసి సాగించేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇక, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చాక, తన సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను టార్గెట్ చేసి అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చిని సినీ నటుడు కార్తీక్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్ని ఎదుర్కొన్నా డిపాజిట్లు గల్లంతు కాక తప్పలేదు. తాజాగా, డిఎంకే వెంట నడిచేందుకు కార్తీక్ సిద్ధ పడ్డారు.

తమకు అక్కున చేర్చుకునే విధంగా డిఎంకే వర్గాలతో మంతనాలకు సిద్ధమయ్యారు. ఇక, అందరి చూపు డీఎండీకే అధినేత విజయకాంత్ వైపు ఉంటూ వస్తోంది. నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతూ వస్తున్న విజయకాంత్, డీఎంకేతో పొత్తుకు గోపాలపురం  దరిదాపుల్లోకి వచ్చి ఆగి ఉన్నారని చెప్పవచ్చు. ఆ పార్టీ ఓటు బ్యాంక్ తమకు తప్పని సరి కావడంతో, రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికేందుకు డిఎంకే వర్గాలు సిద్ధంగానే ఉన్నాయి.

అయితే, దరిదాపుల్లో ఆగిన విజయకాంత్ రెండు మూడు రోజుల్లో  గోపాలపురంలోకి అడుగు పెట్టే యోచనలో ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో గురువారం తన నియోజకవర్గం రిషివంధియంలో జరిగిన కార్యక్రమంలో విజయకాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ను వెనకేసుకు రావడం ఆలోచించాల్సిందే. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం విదేశీ ఆస్తుల వ్యవహారంలో పార్లమెంట్, రాజ్య సభల్లో  అన్నాడీఎంకే నానా రాద్దాంతం సృష్టిస్తుండడాన్ని ప్రస్తావిస్తూ, ఢిల్లీలో ఓ న్యాయం, రాష్ట్రంలో ఓ న్యాయమా ..? అంటూ అసెంబ్లీలో అధికార పక్షం తీరును దుయ్యబట్టారు.

విజయకాంత్‌తో మంతనాలకు బీజేపీ పెద్దలు చెన్నై చేరుకునే సమయంలో ఆయన, రిషివంధియంకు చెక్కేయడం గమనార్హం. ఇక, డిఎంకేకు క్యాథలిక్ క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన సంఘం పెద్ద యూనికో హృదయ రాజ్ తమ మద్దతును డీఎంకేకు  ఇస్తున్నామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు