కథ్‌పుత్లీ కాలనీని ఖాళీ చెయ్యం

23 Feb, 2014 23:44 IST|Sakshi
కథ్‌పుత్లీ కాలనీని ఖాళీ చెయ్యం

 న్యూఢిల్లీ: దశబ్దాల కాలంగా నివసిస్తున్న క థ్‌పుత్లీ కాలనీని ఖాళీ చేసేదేలేదని స్థానిక బొమ్మల తయారీదారులు, జానపద కళాకారులు చెబుతున్నారు. ఈ కాలనీని ఖాళీ చేసి మరోచోటుకు వెళ్లాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో స్థానిక పెద్దలు మీడియాతో మాట్లాడారు.

 

ప్రైవేటు వ్యక్తులకు ఈ కాలనీని కట్టబెట్టాలని  చూస్తున్నారని, దశాబ్దాల కాలంగా ఇక్కడే ఉంటు, ఇక్కడే పుట్టిపెరిగిన తాము మరోచోటుకు ఎలా వెళ్తామని ప్రశ్నించారు.

 

2009 ప్రణాళిక ప్రకారం ఈ కాలనీలోని కళాకారులను తాత్కాలికంగా మరోచోటుకు తరలించి, నాలుగేళ్లలో ఇక్కడ ఫ్లాట్లు సిద్ధం చేయాలనేది అధికారుల వ్యూహంగా కనిపిస్తోందని, ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్నవారిని ఆనంద్ ప్రభాత్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలోకి తరలిస్తారని చెబుతున్నారని, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని అధికారులను ప్రశ్నించినా సమాధానమే లేదన్నారు. తాము ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నామని, ఇప్పుడు ఖాళీ చేసి, నాలుగు కిలోమీటర్ల దూరం తాత్కాలికంగా, ఆ తర్వాత మరెక్కడికో వెళ్తే వారి చదువులు సాగేదెలాగని స్థానిక వ్యక్తి దిలీప్ భట్ ప్రశ్నించారు.

 

భూమి విషయంలో అధికారులు అబద్ధమాడుతున్నారు. బిల్డర్ల కోసం భూమి అందుబాటులో ఉందని మొదట చెప్పారు. ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు.
 

మరిన్ని వార్తలు