తారస్థాయికి బీజేపీలో అసమమ్మతి

31 Mar, 2016 04:41 IST|Sakshi
తారస్థాయికి బీజేపీలో అసమమ్మతి

మూడు రోజులుగా   మూతపడిన కెలమంగలం బీజేపీ కార్యాలయం
గుర్తింపు లేని వ్యక్తికి టికెట్ కేటాయింపుపై అసంతృప్తి

 
డెంకణీకోట : తళి నియోజకవర్గంలో బీజేపీ అసమ్మతి కార్యకలాపాలు తారస్థాయికి చేరుకొన్నాయి. కెలమంగలంలోని సమితి బీజేపీ కార్యాలయం మూడు రోజులుగా మూతపడి ఉంది. తళి నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం ఎక్కువ మంది అశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. బీజేపీ అధిష్టానం హొసూరు, తళి, క్రిష్ణగిరిలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తళి నియోజకవర్గంలో టికెట్ కోసం కే,సి. మునిరాజు, ఎన్. గోపాలరెడ్డి వంటి పలుకుబడి, ఆర్థిక స్థోమత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరికి టికెట్ లభించలేదు. సామాన్య కార్యకర్తగా గుర్తింపు పొందిన బీ రామచంద్రన్‌కు టికెట్ లభించంతో తీవ్ర అసంతృప్తి బయలుదేరింది. ఆయన  సరైన అభ్యర్థి కాదని పార్టీలో మరో వర్గం వాదిస్తోంది.

రాష్ట్ర బీజేపీ నాయకుడొకరు ఉద్దేశపూర్వకంగా తళి నియోజకవర్గంలో అసమర్థుడైన అభ్యర్థిని ఎంపిక చేశారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దీంతో కెలమంగలం సమితి బీజేపీ కార్యాలయానికి అద్దె చెల్లింపు ఖర్చులకు కూడా డబ్బులేదని గత మూడు రోజులుగా కెలమంగలం సమితి బీజేపీ కార్యాలయాన్ని మూసివేశారు. కెలమంగలం సమితిలో భారతీయ జనతాపార్టీలో అసమ్మతి రాగాలు జోరందుకోవడంతో జిల్లాలో పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు మునిరాజు పరిస్థితిని చక్కదిద్దకపోతే బీజేపీ తళి నియోజవర్గంలో గడ్డుపరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందంటున్నారు.

మరిన్ని వార్తలు