నేడు హిజ్రాల పెళ్లి సందడి..

5 May, 2015 02:24 IST|Sakshi
నేడు హిజ్రాల పెళ్లి సందడి..

  నేడు పెళ్లి వేడుక
  మిస్ కూవాగం పోటీలు
 
 సాక్షి, చెన్నై: కూవాగం కూత్తాండవర్ ఆలయ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో హిజ్రాలు తరలి వస్తున్నారు. మంగళవారం జరిగే వివాహ మహోత్సవంలో ఆలయ పూజారి చేత తాళి కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునగనున్నారు. ఇక అందగత్తెలకు, మోడల్స్‌కు తామేమీ తీసి పోమన్నట్టుగా ర్యాంప్‌పై వయ్యారాలు ఒలక బోస్తూ మిస్ కూవాగం కిరీటాన్ని తన్నుకెళ్లే పనిలో పడ్డారు. రాష్ర్టంలోని విల్లుపురం జిల్లా ఉలందూరుపేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో ప్రతియేటా జరిగే ఉత్సవాలు దేశ విదేశాల్లోని హిజ్రాలకు ఓ వసంతోత్సవం.
 
  ఇక్కడి వేడుకకు మహాభారత యుద్ధగాథ ముడి పడి ఉన్నదంటూ పురాణాలు చెబుతున్న విషయం తెలిసిందే. ఇతిహాసం మేరకు మోహినీ అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడిని వివాహమాడిన ఐరావంతుడిని తమ ఆరాధ్యుడిగా హిజ్రాలు కొలుస్తూ వస్తున్నారు. ఇక్కడ కొలువు దీరిన ఐరావంతుడి ఆలయంలో ప్రతియేటా చైత్రమాసంలో  వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది కూత్తాండవర్ ఉత్సవాలు గత నెల 22న ఆరంభమయ్యాయి. ధ్వజారోహణం వేడుకతో ఉప వాస వ్రతాన్ని చేపట్టి ఆలయ అర్చకులు ప్రతిరోజూ ప్రత్యేకంగా ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు. మహా భారత గాధను ప్రజలకు వివరిస్తూ నాటక ప్రదర్శన జరుపుతున్నారు.
 
 నేడు హిజ్రాల పెళ్లి సందడి..
 ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిజ్రాలు తరలి వస్తారు. మంగళవారం జరిగే పెళ్లి వేడుక కోసం ఇప్పటికే హిజ్రాలు కూవాగంకు పోటెత్తుతున్నారు. లాడ్జీలు, గెస్టు హౌస్‌లు, విడిదులు హిజ్రాలతో నిండిపోయాయి. హిజ్రాల పెళ్లి సందడి నిమిత్తం ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున దుకాణాలు వెలిశాయి. పెళ్లికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, తాళిబొట్ల కొనుగోళ్లపై హిజ్రాలు దృష్టి కేంద్రీకరించారు. ప్రధానంగా ఆంధ్రా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తమిళనాడులోని 32 జిల్లాల నుంచి, విదేశాల నుంచి హిజ్రాలు వస్తున్నారు. మంగళవారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా తాళి బొట్టు కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలనున్నారు. రాత్రంతా ఆలయ పరిసరాల్లో జాగారంతో సందడి చేయనున్నారు. ఐరావంతుడిని తమ భర్తగా స్వీకరించే హిజ్రాలు మరుసటి రోజు బుధవారం తాళి బొట్లను తెంచి పడేసి ఒప్పారి పెట్టనున్నారు. ఏడుపులు పెడబొప్పలతో ఒప్పారి అనంతరం తెల్ల చీర ధరించి తమ తమ స్వస్థలాలకు వెళ్తారు.
 
 మిస్ కూవాగం
 అందగత్తెలకు, మోడల్స్‌కు తామీమి తీసిపోమన్నట్టుగా ఇక్కడ హిజ్రాలు దూసుకెళుతున్నారు. పలు సంస్థల నేతృత్వంలో మిస్‌కూవాగం పోటీలతో పాటుగా హిజ్రాల ప్రతిభను చాటే విధంగా పోటీలు సోమవారం సాయంత్రం నుంచి ఆరంభమయ్యాయి. తొలుత ఓ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో స్థానికంగా జరిగిన మిస్ కూవాగంకు చెన్నై, సేలం, తిరుచ్చి, ఈరోడ్ నుంచి వచ్చిన అందగత్తెలైన హిజ్రాలు ర్యాంప్‌పై వయ్యారాలు ఒలక బోశారు. తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ బోర్డుల నేతృత్వంలో అసలైన మిస్ కూవాగం పోటీ జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు హిజ్రాలు సిద్ధమయ్యారు. అంతకు ముందు ఎయిడ్స్ అవగాహనలో భాగంగా నాటకాలను హిజ్రాలు ప్రదర్శించి అందర్నీ మెప్పించారు.
 

మరిన్ని వార్తలు