విపక్ష నేత ఎంపికపై కొనసాగుతున్న అనిశ్చితి

18 Dec, 2014 01:05 IST|Sakshi
విపక్ష నేత ఎంపికపై కొనసాగుతున్న అనిశ్చితి

శాసనసభ సమావేశాలు మొదలై పదిరోజులు గడిచిపోయినా
నాగపూర్: శాసనసభ సమావేశాలు మొదలై పదిరోజులు గడిచిపోయినప్పటికీ మండలిలో ప్రతిపక్ష నేత ఎంపికపై నెలకొన్న అనిశ్చితికి ఇంకా తెరపడలేదు. ఇందుకు సంబంధించి తక్షణమే ఓ ప్రకటన చేయాలని డిమాండ్‌చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు బుధవారం కూడా మండలి కార్యకలాపాలను స్థంభింపజేశారు. గతవారం కూడా ఇదే అంశంపై మండలిలో కార్యకలాపాలను విపక్షం అడ్డుకున్న సంగతి విదితమే.

బుధవారం మండలిలో కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఎన్సీపీ సభ్యుడు సునీల్ తట్కరే ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘నిబంధనల ప్రకారమే సభా కార్యకలాపాలు సాగాలి. ప్రతిపక్ష నేత లేకుండా జరగకూడదు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ అంశాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవాళ ప్రతిపక్ష నేత పేరును ప్రకటించాలి’అని డిమాండ్ చేశారు. ఇందుకు  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ ‘ఈ అంశం సభాపతి పరిధిలో ఉంది.

ఈ విషయంలో నాకు ఎలాంటి అధికారమూ లేదు. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదు. సభాధ్యక్షుడే కచ్చితంగా ఓ నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నారు. అంతకుముందు ఇదే అంశంపై కాంగ్రెస్ సభ్యుడు మాణిక్‌రావ్‌ఠాక్రే మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇరు సభల సభ్యులను పిలిచి ఓ సమావేశం నిర్వహించాలి. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి’అని అన్నారు. ఇందుకు ఎన్సీపీ సభ్యులు అభ్యంతరం చెబుతూ ఇరు సభలూ వేర్వేరని పేర్కొన్నారు.

సభాపతి శివాజీరావ్ దేశ్‌ముఖ్ జోక్యం చేసుకుంటూ ఈ అంశాన్ని తాను పరిశీలిస్తానన్నారు. వీలైనం త్వరగా ప్రతిపక్ష నాయకుడి పేరును ప్రకటించేందుకు యత్నిస్తానన్నారు. సభాపతి జవాబుపట్ల సంతృప్తిచెందని ఎన్సీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా వెల్‌లోకి దూసుకుపోయారు. ‘గివ్ జస్టిస్, గివ్ జస్టిస్, గివ్ జస్టిస్’ అంటూ సభ దద్దరిల్లేలా నినదించారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో సభాపతి సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.
 
ఆ ఆలోచనేదీ లేదు
కొత్త ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు యోచనేదీ లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం విధానమండలిలో వెల్లడించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో వివిధ కళాశాలల్లో 43 శాతం సీట్లు వృథాగాఉన్నాయన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా నాగోగనార్, అనిల్ సోలే తదితర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు.

రాష్ర్టంలో మొత్తం 367 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని, ఇందులో పది ప్రభుత్వ కళాశాలలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ కళాశాలల సీట్ల సంఖ్య 1,56,067 కాగా అందులో 67,184 సీట్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వ కళాశాలల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా లేదన్నారు. కొన్ని విద్యాసంస్థలు భారీ పెట్టుబడులతో ఇంజనీరింగ్ కళాశాలలను, అయితే అక్కడ తరగతులు సరిగా జరగడం లేదన్నారు. ఇటువంటి కళాశాలల ప్రాంగణాలను ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదన్నారు.

మరిన్ని వార్తలు