జంగ్ వార్నింగ్!

2 Sep, 2014 22:32 IST|Sakshi

 న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్.. ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థలో పారదర్శకత లోపించిందని, బాధ్యతారాహిత్యం పెరిగిందని, సంస్థ పని సామర్థ్యం తగ్గిందని, అవినీతి, పనుల్లో జాప్యం వంటివి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ పనితీరును మెరుగు పర్చుకునేందుకు, పాదర్శక విధానాలను అమలు చేసేందుకు అవసరమైన పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు రెండువారాల గడువునిస్తున్నట్లు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో డీడీఏ పనితీరుపై, సంస్థలో జరుగుతున్న అవినీతిపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో జంగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
 డీడీఏ సీనియర్ అధికారులతోపాటు ముఖ్యమైన అధికారులు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో జంగ్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో కథనాలు వస్తున్నా కూడా అధికారులు తమ పనితీరును మార్చుకోవడం లేదని, ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారెందుకని ప్రశ్నించారు. సంస్థ పనితీరు మెరుగుపడాలంటే పునర్నిర్మాణ ప్రణాళిక అవసరమని తాను భావిస్తున్నానని, రెండువారాల్లో ఈ ప్రణాళికను సిద్ధం చేయాలని డీడీఏ పరిపాలనా విభాగం అధికారిని ఆదేశించారు. రెండు వారాల్లో నివేదిక తన టేబుల్‌పై లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
 సంస్థ చేస్తున్న ప్రతి పనిని, అందిస్తున్న సేవల వివరాలను కంప్యూటరీకరించాలని ఆదేశించారు. డీడీఏ పని సామర్థ్యాన్ని కూడా పెంచాలని, చేపట్టే ప్రతి పనికి సంస్థలోని ఎవరో ఒక అధికారి బాధ్యత వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి గందరగోళం లేకుండా ఉండాలని, ప్రతి పని పూర్తి పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. పై అధికారుల పర్యవేక్షన నిరంతరం కొనసాగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
 
 ప్రణాళిక సిద్ధం...
 డీడీఏ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశామని, తుది మెరుగులు దిద్ది రెండు వారాల్లో సమర్పిస్తామని జంగ్‌కు డీడీఏ అధికారులు హామీ ఇచ్చారు. డీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల వివరాలను కూడా జంగ్‌కు వివరించారు. భూసేకరణ విభాగం ఇప్పటికే అవసరమైన భూమిని సేకరించిందని, దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లను నిర్మించి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. డీడీఏ పనితీరు మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఇచ్చిన సూచనల మేరకే పునర్నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేశామని, ఏప్రిల్ నాటికి ప్రణాళికలు పూర్తిగా అమలయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కౌన్సిల్ ఇచ్చిన సూచనల ప్రకారం... సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనుల్లో కొన్నింటిని ఔట్ సోర్సింగ్ చేయాలి. ఈ విషయమై ఔట్ సోర్సింగ్ సంస్థల కోసం అన్వేషిస్తున్నామన్నారు.
 
 పంటలను ఎక్కడైనా అమ్ముకోండి: జంగ్
 న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తులను రైతులు మండీలోనే కాకుండా బయట ఎక్కడైనా అమ్ముకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రకటించారు. ఆజాద్‌పూర్, కిషోర్‌పూర్, షహదరా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలోని వ్యవసాయ ఉత్పత్తుల జాబితా నుంచి కూరగాలు, పండ్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో రైతులు తాము పండించిన పండ్లను, కూరగాయలను ఇకపై తప్పనిసరిగా ఏపీఎంసీలోనే అమ్ముకోవాలనే నిబంధన ఏమీ లేదన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఓ నోటీసు కూడా విడుదల చేసింది. ఢిల్లీ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్(క్రమబద్ధీకరణ) చట్టం, 1998 ప్రకారం.. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్ యార్డుల్లోనే అమ్ముకోవాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నోటీసులో పేర్కొంది.
 6
 గోడల మీద పోస్టర్లు అతికించినవారిపై కఠిన చర్యలు తీసుకోండి
 న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం పేరుతో పోస్టర్లను అతికిస్తూ గోడలను పాడు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం పోలీసులను కోరింది. పోస్టర్లను అతికించుకునేందుకు, బ్యానర్లు కట్టుకునేందుకు విశ్వవిద్యాలయం పరిసరాల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించామని, అయినా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై, బస్సులు, రైళ్లల్లో కూడా పోస్టర్లు అతికిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఇటువంటివారిపై చర్యలు తీసుకోవాలని డీయూ కోరింది. ఢిల్లీ ప్రజా ఆస్తుల రక్షణ చట్టం ప్రకారం పోస్టర్లు అతికించేవారిపై కేసు నమోదు చేయాలని, దర్యాప్తు జరిపి, నేరం రుజువైతే కఠినంగా శిక్షించాలని డీయూ అధ్యాపకుడు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల(డూసూ) కమిషనర్ డీఎస్ రావత్ పోలీసులను కోరారు.
 
 పోలీసులు చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకుంటే ప్రజా ఆస్తుల రక్షణ చట్టం నిరుపయోగంగా మారుతుందన్నారు. చట్టం సరిగ్గా అమలు కావాలంటే కఠిన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని కోరారు. డూసూ ఎన్నికలు ఈ నెల 12న జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ, బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీతోపాటు పలు పలు పార్టీల విద్యార్థి విభాగాలు పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి.
 ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రింటింగ్ పోస్టర్లను ప్రచారం కోసం వినియోగించరాదనే నిబంధన ఉన్నప్పటికీ పోటీదారులు యథేచ్ఛగా పోస్టర్లను అతికిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఈ విషయమై ఢిల్లీ పోలీసులతో పలుమార్లు సమావేశమయ్యామని, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని రావత్ తెలిపారు.
 
 ఎన్నికల బరిలో కొత్త విద్యార్థి విభాగం
 ఈసారి జరగనున్న డూసూ ఎన్నికల్లో కొత్త విద్యార్థి విభాగం పోటీ చేయనుంది. ఇప్పటిదాకా ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ, బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం బీజేపీ మధ్య జరుగుతుండగా సీపీఐ, సీపీఎంకు చెందిన విద్యార్థి విభాగాలు ఎస్‌ఎఫ్‌ఐ వంటివి కూడా పోటీ చేస్తున్నాయి. కాగా ఈ ఏడాది ‘చాణక్య పరిషద్’ పేరుతో ఏర్పాటైన కొత్త విద్యార్థి విభాగం కూడా ఎన్నికల్లో పోటీ చేయనుంది. ‘ఇప్పటిదాకా ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీల మధ్యే పోటీ జరిగింది. ఈ రెండు విభాగాలు కూడా కండబలం, ధనబలాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించాయి. ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నాం. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా కొత్త విద్యార్థి విభాగాన్ని తీసుకురావాలనుకున్నాం. కొత్తగా వ చ్చే విద్యార్థి విభాగం విద్యార్థుల్లో సాధికారత పెంచేదిగా ఉండాలని నిర్ణయించాం. ఈ అవసరాన్ని గుర్తించిన ఎంతోమంది మాతో కలిసి వచ్చారు. అలా ఏర్పాటైందే చాణక్య పరిషద్’ అని అధ్యక్షుడు మంతోశ్ శర్మ తెలిపారు. తాము పోటీ చేయనుండడంతో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల స్వరూపం మారిపోవడం ఖాయమన్నారు.
 

మరిన్ని వార్తలు