ఉప ఎన్నికలకు సీఈసీ సిద్ధం

14 Oct, 2016 01:31 IST|Sakshi

వచ్చేవారం నోటిఫికేషన్ విడుదల
తమిళనాడులో మూడు, పుదుచ్చేరిలో ఒకటి
వాయిదా అంటూ అనుమానాలు
 

సాక్షి ప్రతినిధి, చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలు వెనక్కుపోవడంతో ఉప ఎన్నికలు ముందుకు వచ్చేశాయి. తమిళనాడు, పుదుచ్చేరిల్లోని మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ఖరారు చేస్తూ మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రధాన ఎన్నికల కార్యాలయం (సీఈసీ) వర్గాల బోగట్టా.
 
ఈ ఏడాది మే నెలలో రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా 232 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. నగదు, బహుమానాలతో ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఎన్నికల కమిషన్ అనేక చర్యలను చేపట్టింది. ఫ్లయింగ్ స్వ్కాడ్ తనిఖీల ద్వారా కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకుంది. అయినా, కరూరు జిల్లా అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే అభ్యర్థుల ద్వారా విచ్చలవిడిగా నగదు బట్వాడా సాగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికలను నిలిపివేయాలంటూ డీఎంకే కోర్టులో పిటిషన్ వేసింది.
 
పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు అరవకురిచ్చి తంజావూరులలో ఎన్నికలు వాయిదావేసింది. ఈ కారణంగా 232 స్థానాల్లోనే ఎన్నికలు జరిగాయి. మధురై జిల్లా తిరుప్పరగున్రం నుంచి పోటీచేసి గెలుపొందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనివేల్ ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల్లోనే అనారోగ్యానికి గురై మృతి చెందారు. దీంతో మొత్తం మూడు నియోజకవర్గాలు ఖాళీగా నిలిచాయి. ఎన్నికల చట్టం ప్రకారం ఈ మూడు నియోజకవర్గాల్లో ఆరునెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం (అక్టోబరు) ఐదో నెల సాగుతోంది. మరో నెలరోజుల్లో ఆ మూడు నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్‌ను పూర్తిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం ఒకటిన్నర నెల కాలం పరిమితి అవసరం. కాగా, పుదుచ్చేరీ సీఎం నారాయణ స్వామి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందకుండా సీఎం పీఠం ఎక్కారు.
 
 
దీంతో ఆరునెలల్లోగా ఆయన ఏదో ఒక నియోజవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి ఉంది. నారాయణ స్వామి కోసం నెల్లితోప్పు ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. తమిళనాడు, పుదుచ్చేరీలు కలుపుకుని మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల కోసం వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు చీఫ్‌ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ద్వారా అందిన సమాచారం.
 
అమ్మ లేకుండా ఎన్నికలా?
ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో ఉప ఎన్నికలు అవసరమా అని అధికార పార్టీ ఆలోచిస్తోంది. అమ్మ ఆసుపత్రిలో చేరి 23 రోజులు గడిచింది. అనారోగ్యం నుంచి ఎపుడు కోలుకుంటారో, ఎపుడు ఇంటికి తిరిగి వెళతారో ఎవ్వరూ అంచనావేయలేని పరిస్థితి. అమ్మ ఆనారోగ్యంతో పార్టీ శ్రేణులంతా విషణ్ణ వదనులై ఉన్నపుడు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం ఎలా సాధ్యమని అంటున్నారు.  ఎన్నికలపై ఏకాగ్రత ఉంచడం సాధ్యం కాదని పేర్కొంటూ ఎన్నికల కమిషన్‌ను వాయిదా కోరాలని భావిస్తున్నారు.
 
అయితే రాజ్యాంగ బద్దంగా ఆరునెలల్లోగా జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా వేయడం ఎన్నికల కమిషన్‌కు సాధ్యమేనా అని అనుమానిస్తున్నారు. అమ్మ పరోక్షంలో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా పడాలని అధికార అన్నాడీఎంకే ఆశిస్తుండగా, యథావిధిగా ఎన్నికలు జరగాలని ప్రతిపక్ష డీఎంకే సహజంగానే కోరుకుంటోంది. పార్టీల విజ్ఞప్తులు, సీఎం అనారోగ్యం, ప్రభుత్వంలో అనిశ్చితిని ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు