నిధులు తగ్గాయా? దారి మళ్లుతున్నాయా? | Sakshi
Sakshi News home page

నిధులు తగ్గాయా? దారి మళ్లుతున్నాయా?

Published Fri, Oct 14 2016 1:37 AM

నిధులు తగ్గాయా? దారి మళ్లుతున్నాయా? - Sakshi

రాష్ట్ర ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కోదండరాం
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం డిమాండ్ చేశారు. కోదండరాం అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన కోర్‌కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, కేంద్ర నిధులు తగ్గాయా లేక వస్తున్న ఆదాయం, గ్రాంట్లు దారిమళ్లుతున్నాయా అని కోదండరాం ప్రశ్నించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, ఖర్చులపై, రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధులను చెల్లించడం లేదని విమర్శించారు.

ధనిక రాష్ట్రం అని, రెవెన్యూ మిగులు అని చెబుతున్న రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి రూ.630 కోట్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ. 4,300 కోట్ల బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిం చారు. రైతులకు రుణమాఫీ ఇప్పటిదాకా చేయలేదని, ఇన్‌పుట్ సబ్సిడీని ఇంకా అందించలేదన్నారు. జేఏసీ సమన్వయకర్త పిట్టల రవీందర్ మాట్లాడుతూ నవంబరు తొలివారంలో వైద్య, ఆరోగ్యరంగం, ప్రజల ఇబ్బందులపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రఘు, జి.వెంకట రెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం, ఎన్.ప్రహ్లాద్, గురజాల రవీందర్‌రావు, ఖాజా మొయినుద్దీన్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement