ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడేదెన్నడో ?

21 Oct, 2014 23:31 IST|Sakshi
ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడేదెన్నడో ?

సాక్షి, ముంబై: కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడడంలేదు. దీపావళిలోపు స్పష్టమవుతుందని అంతా భావించారు. అయితే ఈ పండుగ తర్వాతే ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకొచ్చినప్పటికీ ఎవరి మద్దతు తీసుకుంటుంది? ముఖ్యమంత్రిగా పీఠం ఎవరికి దక్కుతుంది ? తదితర అంశాలపైనే రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకతమైంది.

ఈ నేపథ్యంలో అనేక ఊహగానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎవరనే  విషయానికి సంబంధించి రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం జరిపేందుకు రాజ్‌నాథ్ సింగ్ ముంబైకి సోమవారం రానున్నారని ప్రకటించారు. అయితే ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు మరింత జాప్యం కానుందనే విషయం స్పష్టమైంది. మంగళవారం వస్తారని అనుకున్నప్పటికీ రాలేదు.

భావి ముఖ్యమంత్రి నితిన్ గడ్కరీ?
ముఖ్యమంత్రిగా నితిన్ గడ్కరీ పేరును బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్ ప్రతిపాదించారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన తమ పార్టీ నాయకులంతా నితిన్ గడ్కరీని భావి ముఖ్యమంత్రిగా చూస్తున్నారన్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో నితిన్ గడ్కరీ పేరు మార్మోగింది. గడ్కరీ వర్గానికి చెందిన నాయకుడిగా భావించే సుధీర్ ఇలా పేర్కొనడంపై అనేక మంది పలుఅనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి రేసులో లేనని నితిన్ గడ్కరీ చెబుతున్న తరుణంలో ఆయన ఇలా ప్రకటించడంలోని ఆంతర్యందేవేంద్ర ఫడ్నవిస్‌ను వ్యతిరేకించేందుకేనని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ రేసులో దేవేంద్ర ఫడ్నవిస్ పంకజా ముండేల పేర్లు అందరికంటే ముందుంది. ఈ నేపథ్యంలో సుధీర్ మునగంటివార్ ప్రతిపాదనకు ఎంతమద్దతు పలుకుతారనే విషయం తెలియాలంటే వేచిచూడాల్సిందే.

మరిన్ని వార్తలు