మానవత్వం మరచి!

20 Sep, 2016 02:50 IST|Sakshi
మానవత్వం మరచి!

- రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు
- టాప్‌పై ఎగిరిపడి ప్రాణాలు వదిలిన వైనం
- కిలోమీటరున్నర దూరం ఆపకుండా వెళ్లిన డ్రైవర్
- యువకులు వెంబడించడంతో కారు వదిలి పరార్

 
జడ్చర్ల: ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ.. మానవత్వం ఉన్నవాడు..’ సమాజంలో రానురాను కరువవుతున్న మానవత్వం చిరునామాను వెతుకుతూ ఓ కవి హృదయం పడ్డ ఆవేదన ఇదీ! దీనికి అద్దంపట్టే ఘటన తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో జరిగింది. జడ్చర్లలో నిమ్మబాయిగడ్డకు చెందిన  శ్రీను (35) రోడ్డు దాటుతుండగా ఎరుపు రంగు చవర్లేట్ కారు  వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఒక్క ఉదుటున శ్రీను కారుపై భాగంలో ఎగిరిపడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయినా కారును కనీసం ఆపకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. కారుపై మృతదేహంతోనే సుమారు కిలోమీటరున్నర దూరం వెళ్లాడు.
 
 దీన్ని గమనించిన కొందరు యువకులు బైక్‌లపై వెంబడించగా.. మాచారం గ్రామానికి కొద్దిదూరంలో బ్రిడ్జి వద్ద కారును వదిలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జడ్చర్లకు సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ యువకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి కారును స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన చంద్రకళ అనే మహిళ పేరిట రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు