చిక్కుల్లో మంత్రి, ఎంపీ

28 Feb, 2016 02:47 IST|Sakshi
చిక్కుల్లో మంత్రి, ఎంపీ

  ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని మంత్రి ప్రలోభం
  మహిళా ఎంపీ వాట్సాప్‌లో దుర్భాషలు
  ఆలయాల చుట్టూ తిరుగుతున్న శశికళ

 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నిక లు సమీపిస్తున్న వేళ అన్నాడీఎంకేలో లుకలుకలు తరచూ తెరపైకి వస్తున్నాయి. మంత్రి రమణ ఉదంతం నుంచి ఇంకా తేరుకోకముందే మరో మంత్రి వివాదాల్లో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే టికెట్టు ఆశచూపి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో ఎడప్పాడి పళనిస్వామికి ముప్పు పొంచి ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే అన్నాడీఎంకే ఎంపీ సత్యభామ తన భర్తను దుర్భాషలాడినట్లుగా వాట్సాప్‌లో జరిగిన ప్రచారం కలకలం సృష్టించింది. పాడిపరిశ్రమాభివృద్ధి మంత్రి రమణ తన సతీమణితో ఏకాంతంగా దిగిన ఫొటోలు వాట్సాప్‌లో హల్‌చల్ చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న జయలలిత ఆయనపై వేటువేశారు.
 
 మంత్రి పదవితోపాటు పార్టీ పదవిని సైతం రమణ కోల్పోయారు. మంత్రులు ఓ పన్నీర్ సెల్వం, నత్తం విశ్వనాథం అనుచరులపై అమ్మ వేటువేయడం ద్వారా పార్టీ వ్యవహారాల్లో తన కచ్చితమైన వైఖరిని తేటతెల్లం చేశారు. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే నుండి అసెంబ్లీకి పోటీచేయగోరు అభ్యర్దులు పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, వారికి తాను సిఫార్సు చేసి టిక్కెట్టు మంజూరు అయ్యేలా చూస్తానని మంత్రి ఎడప్పాడి పళనిస్వామి కొందరితో బేరాలు కుదుర్చుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చైన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఒక బృందం శుక్రవారం సాయంత్రం ఆత్తూరుకు చేరుకుని ఎడప్పాడి ముఖ్య అనుచరుడు, సహకార బ్యాంకు అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఒక నేత ఇంటిలో తనిఖీలు నిర్వహించింది. తనిఖీలు నిర్వహించన సమయంలో సదరు నేత ఇంటిలో లేడు.
 
  తనిఖీలు పూర్తిచేసుకున్న ఆ బృందం కొన్ని ఆధారాలతో కూడిన పత్రాలతో రాత్రికి రాత్రే చెన్నైకి చేరుకుంది. పార్టీ ప్రచార సభలో ఉన్న మంత్రి అనుచరుడు అత్యవసరంగా చెన్నై వెళ్లాలని చెప్పి కేవలం మూడు నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించాడు. సేలం జిల్లాలోని 11 నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారితో మంత్రి అనుచరులు లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలియడం వల్లనే తనిఖీలు సాగాయని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
 
 మహిళా ఎంపీ కలకలం
  తిరుప్పూరు పార్లమెంటు సభ్యురాలు (అన్నాడీఎంకే) సత్యభామ తన భర్త వాసుతో ఆస్తులు, అప్పులు, వాహనాల వ్యవహరంలో తగవులాడినట్లుగా వాట్సాప్‌లో సంభాషణ కలకలం సృష్టించింది. ‘నీవు హద్దుమీరి వ్యవహరిస్తున్నావు, ఎటువంటి పరిస్థితులనైనా నేను ఎదుర్కొనేందుకు సిద్ధం... నా చేతిలో అధికారం ఉంది.. ఇలా సాగిన సంభాషణ శ్రుతి మించి వారిద్దరి సన్నిహితుల పట్ల పరస్పర ‘శీల’ విమర్శల స్థాయికి చేరుకుంది.
 
 ఎంపీ సత్యభామ, భ ర్త వాసుల మధ్య జరిగినట్లుగా భావిస్తున్న సంభాషణలు ఒక తమిళ సాయంకాల దినపత్రికలో ఎంపీ ఫొటోతోపాటు యథాతథంగా ప్రచారం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ నేతలుగా వ్యవహరిస్తున్నవారు ప్రతిష్టను బజారుకీడ్చడాన్ని సహించలేకనే రమణపై జయ వేటు వేసారు. మరి తాజాగా సాగుతున్న వివాదాస్పంద అంశాలపై అమ్మ ఏమి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ నేతలు వణికిపోతున్నారు.
 
 శశికళ పూజలు
 తన స్నేహితురాలు, ముఖ్యమంత్రి జయలలిత కోసమా లేక తాను ఎమ్మెల్యే అయ్యేందుకా అనేది స్పష్టం కాకున్నా శశికళ ఇటీవల ఆలయాల చుట్టూ తీవ్రంగా తిరుగుతున్నారు. గతంలో మధురై, పళని ఆలయాల్లో పూజలు పూర్తిచేసుకున్న శశికళ తాజాగా తిరుచ్చిరాపల్లిలోని శ్రీరంగనాధస్వామి వారిని సేవించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత శ్రీరంగం నియోజకవర్గం నుండే గెలుపొంది, ఆస్తుల కేసులో జైలు శిక్ష కారణంగా ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. చెన్నై నగరం ఆర్కేనగర్ నుండి ప్రస్తుతం జయలలిత ప్రాతినిధ్యం వహిస్తుండగా జయ తాజా మాజీ నియోజకర్గంలోని శ్రీరంగంలో శశికళ పూజలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  
 
 శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీరంగం ఆలయంలో గడిపి సాయంత్రానికి శివగంగై జిల్లా తిరుగోష్ట్టియూరులోని ఆలయానికి చేరుకుని పెరుమాళ్, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అక్కడి నుండి ఇదే ఆలయానికి సమీపంలోని పురీశ్వరన్ ఆలయంలో బాల కాలభైరవ స్వామికి పూజలు చేశారు. ఈ ఆలయంలో శివుడు మూల విరాట్టుగా ఉన్నా బాల కాలభైరవ స్వామికే ప్రాధాన్యత ఎక్కువ.
 
 చోళరాజుల కాలంలో యుద్దాలకు బయలుదేరే ముందు విజయం కోసం పూజలు చేయడం ఆనవాయితీ ఉండేది. నేడు ఎన్నికల్లో అదే విజయాన్ని ఆశిస్తూ శశికళ పూజలు నిర్వహించడం గమనార్హం. అక్కడి నుంచి పిళ్లయార్ పట్టి వినాయకుని సన్నిధిలో పూజలు జరిపారు. శశికళతోపాటు ఆమె అన్నకుమార్తె ప్రభావతి కూడా ఉన్నారు. అన్ని ఆలయాల్లోనూ శశికళకు భారీ స్థాయిలో స్వాగత సత్కారాలు అందాయి. కేవలం ఒక్కరోజులో నాలుగు ఆలయాల్లో పూజలు నిర్వహించడం ఎన్నికల్లో గెలుపుకోసమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 

మరిన్ని వార్తలు