గూగుల్ ఓ అవసరం..ప్రమాదం | Sakshi
Sakshi News home page

గూగుల్ ఓ అవసరం..ప్రమాదం

Published Sun, Feb 28 2016 2:54 AM

గూగుల్ ఓ అవసరం..ప్రమాదం - Sakshi

గూగుల్ లేని ఇంటర్నెట్‌ను ఊహించడమే అసాధ్యం
కంప్యూటర్లు, మొబైల్స్‌పై పూర్తి ఆధిపత్యం దానిదే

 
♦ మొబైల్‌లో ప్రతి సమాచారం గూగుల్ కనుసన్నల్లోనే
♦ పేరుకే ఆండ్రాయిడ్ అందరికీ ఓపెన్... కానీ ప్లేస్టోర్‌దే నియంత్రణ
♦ జీమెయిల్‌లో ఏది పంపినా రహస్యంగా ఉండదు!
♦ సర్చ్ ఫలితాల్లోనూ వాణిజ్య ప్రయోజనాలున్నాయనే విమర్శలు
♦ సమాచారం చేరవేత నుంచి కాపలాదారు పాత్రలోకి..
♦ పలు సర్వీసులపై విదేశాల్లో విమర్శలు... కొన్నింటి నిషేధం కూడా
 
 గూగుల్ అంటే... ఇంటర్నెట్‌కు గుండెకాయ. గుండె చప్పుడు ఆగిపోయే క్షణ కాలాన్ని కూడా మనమెలా ఊహించుకోలేమో... మన లాంటి దేశాల్లో గూగుల్ లేని ఇంటర్నెట్‌ను కూడా అలానే ఊహించలేం. గూగుల్ సెర్చ్, జీమెయిల్, గూగుల్ క్రోమ్, గూగు ల్ ప్లస్, యూ ట్యూబ్, పికాసా, గూగుల్ ఎర్త్, మ్యాప్స్, బుక్స్, మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ ప్లే స్టోర్... ఇలా గూగుల్ ఉత్పత్తుల్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పెపైచ్చు వీటిలో చాలావరకూ మన జీవితంలో విడదీయరాని భాగంగా పెనవేసుకుపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మొబైల్‌లో, కంప్యూటర్‌లో ఇంటర్నె ట్ వాడేవారు... గూగుల్ ఉత్పత్తుల్ని వాడకుండా ఉండటం దాదాపు అసాధ్యం. అయితే... ఇదంతా గూగుల్‌కు ఒక కోణమే. మరి ఇంకో కోణమేంటి...?

 శ్రీధర్ తన ఫ్రెండ్ రాధికకు జీమెయిల్ ద్వారా లేఖ పంపాడు. తాను వారం రోజుల్లో  విదేశాలకు వెళుతున్నానని, నెలరోజులు అక్కడే ఉంటానని రాశాడు. రాధిక ఆ మెయిల్‌కు జవాబిచ్చేలోపే... విదేశాలకు వెళితే తమ సిమ్‌కార్డు తీసుకోండి అంటూ ఓ టెలికం కంపెనీ మార్కెటింగ్ విభాగం నుంచి శ్రీధర్‌కు మెయిలొచ్చింది. అంతేకాదు... విమానం టికెట్లు, ఫారెక్స్ ప్రకటనలు కూడా శ్రీధర్ మెయిల్ బాక్స్‌లోకి వచ్చేశాయి. ఇదెలా సాధ్యమైందంటే జీమెయిల్ ద్వారా శ్రీధర్ పంపిన వివరాల్ని గూగుల్ కంప్యూటర్లు స్కాన్ చేసి... వివరాలను థర్డ్ పార్టీ సంస్థలకు పంపాయి. ఫలితమే ఆ అడ్వర్టయిజ్‌మెంట్ లేఖలు.

 ఇదే కాదు... మొబైల్ ఫోన్లో, కంప్యూటర్లో ఇంటర్నెట్ వాడేవారి సమస్త సమాచారం ఇప్పుడు బహిరంగమే. మీరు పంపే మెయిల్ నుంచి మీ కాంటాక్టుల వరకూ ఏదీ మీ ఒక్కరి సొత్తే కాదు. మొబైల్ అయితే మీరు సందర్శించిన ప్రాంతం నుంచి మీరు వాడుతున్న అప్లికేషన్లు, కాంటాక్టుల దాకా అన్నీ గూగుల్ చేతిలోనే ఉంటాయి. ప్రతి వివరాలూ అందరికీ తెలుస్తాయి. కొన్నిటివల్ల మీకు ఉపయోగం ఉన్నా.. కొన్ని మీకు ఇబ్బందులూ తెచ్చిపెడతాయి. అందుకే... గూగుల్ అంటే ఓ అవసరం. ఓ ప్రమాదం. అదే ఈ వారం ‘ఫోకస్’
 
 జీమెయిల్ రహస్యమేమీ కాదు
 జీమెయిల్ ద్వారా మెయిల్‌ను పంపిన వారు, అందుకున్న వారు తప్ప మూడో మనిషి దాన్ని చదివే అవకాశం లేదని గూగుల్ చెబుతోంది. అయితే కొన్నింటిని బ్లాక్ చేయటానికి, కావాల్సిన ప్రకటనలు మాత్రమే అందించడానికి కంప్యూటర్లు దాన్ని స్కాన్ చేస్తాయని చెబుతోంది. అయితే యాహూ, అవుట్‌లుక్ వంటి పాపులర్ ఈమెయిల్స్ మాత్రం... మెయిల్స్ కాక యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే ప్రకటనల కోసం విశ్లేషిస్తామని చెబుతాయి. అందుకే గూగుల్ చేస్తున్న మెయిల్ స్కానింగ్‌పై 2013లో మైక్రోసాఫ్ట్ విమర్శలు చేసింది. చాలామంది వినియోగదారులకు తమ మెసేజ్‌లను గూగుల్ స్కాన్ చేస్తోందన్న విషయమే తెలియదని పేర్కొంది. తమ ఔట్‌లుక్ సర్వీసు మెయిల్స్‌ను స్కాన్ చేయదని తెలిపింది. మరో విశేషం ఏమిటంటే గూగుల్ పాలసీ ప్రకారం అది సేకరించిన డేటాను ఎన్నాళ్లయినా నిల్వ ఉంచుకోవచ్చు. దీనిపై గూగుల్ ఒక సందర్భంలో కోర్టుకు అఫిడవిట్ ఇస్తూ... గూగుల్ యూజర్లెవరూ తమ ఈమెయిల్స్ రహస్యమని అనుకోవడం లేదని చెప్పటం గమనార్హం. దీన్ని ‘కన్స్యూమర్ వాచ్‌డాగ్’ సంస్థ 2013 ఆగస్టులో బయటపెట్టింది. గార్డియన్ పత్రిక ఈ విషయాన్ని ప్రచురిస్తూ... ‘‘గూగుల్ తన అఫిడవిట్లో ఉద్దేశించింది ఇతర ఈమెయిల్స్ వాడుతున్న వారు జీమెయిల్స్‌కు పంపిన మెయిల్స్ గురించి’’ అని పేర్కొంది.
 
 క్రోమ్‌తో నిరంతరం ట్రాకింగ్
 ఫైర్‌ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, సఫారీ, ఒపెరా వంటి ప్రధాన బ్రౌజర్లన్నిటా ‘డు నాట్ ట్రాక్’ అనేది ఉంటుంది. దీన్ని చేర్చడానికి ఇవన్నీ సంతకాలు చేశాయి. గూగుల్ మాత్రం క్రోమ్‌లో దీన్ని చేర్చడానికి అంగీకరించలేదు. నిజానికి 2011లో వెబ్ అడ్వర్టయిజింగ్ ద్వారా యూజర్ల ప్రవర్తన, అలవాట్లు అన్నిటినీ ట్రాక్ చేయటానికి సంబంధించి గూగుల్‌కు పేటెంట్ లభించింది. ‘డు నాట్ ట్రాక్’పై సంతకం చేస్తే ఈ వ్యాపారం దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే గూగుల్ చేయలేదన్న విమర్శలొచ్చాయి.  యూజర్ల అలవాట్లకు సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్లను ఇవ్వలేకపోతే టెక్నాలజీకి అర్థం లేదని గూగుల్ వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. చివరకు గూగుల్ తన బ్రౌజర్లో ‘కీప్ మై ఆప్ట్ అవుట్స్ (నాకు అక్కర్లేనివి దూరంగా ఉంచు)’ అనే ఎక్స్‌టెన్షన్‌ను అందిస్తోంది. దీనివల్ల ప్రకటన కంపెనీలు తమ కుకీలను మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేయకుండా ఉంటాయి. అయినా విమర్శలు ఆగకపోవడంతో 2012 నవంబర్లో గూగుల్ ‘డునాట్ ట్రాక్’ ఫీచర్‌ను చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. సెట్టింగ్స్‌లో దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
 
 పుస్తకాల కాపీరైట్‌పైనా విమర్శలు
 మిలియన్ల కొద్దీ పుస్తకాల్ని స్కాన్ చేసి.. వాటిని తమ సెర్చ్ ఇంజిన్ ద్వారా చదవటానికి వీలు కల్పిస్తున్న గూగుల్ బుక్స్ ప్రాజెక్టుపై పలు విమర్శలున్నాయి. అసోసియేషన్ ఆఫ్ లెర్న్‌డ్ అండ్ ప్రొఫెషనల్ సొసైటీ పబ్లిషర్స్, అమెరికన్ యూనివర్సిటీ... గూగుల్ ప్రింట్‌ను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశాయి. ‘‘గూగుల్ విజయవంతమైన కంపెనీ. తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరి ప్రాపర్టీపై అయినా పూర్తి హక్కులు దక్కించుకుంటోంది. ప్రతి పుస్తకంపైనా అనుమతి వస్తేనే అలా చేయాలి’’ అని వారు కోరారు. 2009లో తలెత్తిన మరో వివాదంలో.... చైనా రచయితల హక్కుల్ని కాపాడే  చైనా రిటెన్ వర్క్ కాపీరైట్ సొసైటీ... అనుమతి లేకుండా 570 మంది చైనా రచయితలకు చెందిన 18 వేల పుస్తకాల్ని స్కాన్ చేశారంటూ గూగుల్‌ను నిందించింది. దీనిపై వారితో గూగుల్ చర్చలు జరిపింది. చివరకు 2009 నవంబర్ 20న... గూగుల్ తాను స్కాన్ చేసిన పుస్తకాల జాబితాను విడుదల చేసింది. కాపీరైట్ చట్టాల్ని ఉల్లంఘించినట్లు మాత్రం అంగీకరించలేదు. అయితే 2010 జనవరి 9న గూగుల్ బుక్స్ ఏసియా పసిఫిక్ అధిపతి ఒక ప్రకటన చేస్తూ... చైనా రచయితలతో చర్చలు అంత సజావుగా సాగటం లేదంటూ... రచయితలకు క్షమాపణ చెప్పారు.
 
 ప్రైవసీలో అతితక్కువ రేటింగ్
 2012 మార్చి 1 గూగుల్ తన ప్రైవసీ పాలసీని మార్చింది. దీనిప్రకారం తనకు అందిన డేటాను వివిధ సర్వీసులతో పంచుకుంటుంది. ఇలా పంచుకునే వాటిలో యాడ్‌సెన్స్, అనలిటిక్స్‌ను వాడే లక్షల కొద్దీ థర్డ్ పార్టీ వెబ్‌సైట్లూ ఉన్నాయి. ఇంటర్నెట్ యూజర్లు ఆన్‌లైన్లోకి రావాలంటేనే భయపడే ఈ పాలసీపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. వీటికి గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్ సమాధానమిస్తూ... మీకు సంబంధించిన సమాచారం ఎవరికీ తెలియకూడదనుకుంటే... అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా గూగుల్ వంటి సెర్చింజిన్లు కూడా ఆ సమాచారాన్ని కొన్నాళ్లు తమ వద్ద ఉంచుకుంటాయి. ఉదాహరణకు మనందరం అమెరికా పేట్రియాట్ చట్టంలో భాగస్తులమే. మన సమాచారం మొత్తం అధికారులకు అందుబాటులో ఉంటుంది’’ అని చెప్పారు. కాకపోతే ప్రైవసీ లేకుండా గూగుల్ చేస్తున్న చర్యలపట్ల ప్రైవసీ ఇంటర్నేషనల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత అమెరికన్ చట్టాల ప్రకారం గూగుల్ తన దగ్గరున్న డేటా మొత్తాన్ని అమెరికా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. 2007 నాటి నివేదికలో ప్రైవసీ ఇంటర్నేషనల్ సంస్థ గూగుల్‌ను ‘హోస్టైల్ టు ప్రైవసీ’గా వర్ణించి అతితక్కువ రేటింగ్ ఇచ్చింది. ఈ జాబితాలో ఇంత తక్కువ ర్యాంకింగ్ వచ్చింది గూగుల్‌కే.
 
 యూజర్లు తెచ్చిన డేటాతో మ్యాప్స్ వ్యాపారం
 యూజర్లు తాము గుర్తించిన ప్రాంతాలు, రో డ్లు, భవనాల పే ర్లను గూగుల్ మ్యాప్స్‌లో నమోదు చేయొచ్చు. అంటే వివిధ ప్రాంతాలు, మానవీయ ప్రయత్నాల్ని తెలిపే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ మాదిరేనన్న మాట. కాకపోతే ఉచితంగా బయటి జనం ఇచ్చిన డేటాను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తోందన్న విమర్శ గూగుల్ మ్యాప్స్‌పై ఉంది. వాణిజ్యపరంగా తానే యజమానినని చెప్పుకోవటం కూడా వివాదమయింది. డేటా అప్‌డేట్ చేసినవారికి ఏమీ తిరిగివ్వకుండా... పెపైచ్చు లెసైన్సుతో నియంత్రిస్తుండటంపై విమర్శలు రేగాయి.
 
 సమాచార కాపలాదారు స్థాయికి!
 గూగుల్ ఉండాల్సింది సమాచారాన్ని ఒకచోటి నుంచి మరోచోటికి చేరవేసే పాత్రలో.. కానీ ఇపుడది సమాచార కాపలాదారు పాత్రకు ఎదిగిపోయిందనేది మైక్రోసాఫ్ట్‌కు చెందిన జో విల్‌కాక్స్ అభిప్రాయం. ‘‘సెర్చ్‌లో గూగుల్ ఆధిపత్యం బాగా పెరిగింది. సమాచారాన్ని సేకరించటం, దాని చుట్టూ ఉన్న ప్రకటనలకు సహకరించటంలో సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది’’ అనేది ఆయన మాట. నిజానికి సెర్చ్‌లో తనకున్న ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందంటూ రేగిన ఆందోళనలపై 2010లో యూరోపియన్ కమిషన్ విచారణ కూడా జరిపింది. దీర్ఘకాలం విచారణ కొనసాగితే నష్టమని భావించడంతో దీనిపై 2013 మొదట్లో గూగుల్... కొన్ని రకాల సెర్చ్‌లకు సంబంధించి తన పద్ధతులు మార్చుకుంటాననే ప్రతిపాదనలు చేసింది. వీటికి ఈయూ కాంపిటీషన్ కమిషన్ అంగీకరించలేదు. మెరుగైనవి ఇవ్వాలంటూ గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ స్మిత్‌కు లేఖ కూడా రాశారు. అమెరికాలో కూడా ఇలాంటి ఆరోపణలు రేగి 2008 నుంచి 2013 వరకూ విచారణ జరిగింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీపేజ్ వైట్‌హౌస్‌లోని ఫెడరల్ ట్రేడ్ అధికారుల్ని కలుసుకున్నారు. స్వచ్ఛందంగా కొన్ని మార్పుల్ని ప్రతిపాదించారు. దాంతో దర్యాప్తు నిలిచిపోయింది. 2009 జనవరి నుంచి 2015 మార్చి వరకూ గూగుల్ సీనియర్ అధికారులు దాదాపు 230 సార్లు వైట్‌హౌస్ అధికారుల్ని కలసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
 
 సెర్చ్ ఫలితాల దుర్వినియోగం ఇలా..
 2006-07లో ఆస్ట్రేలియన్ పరిశోధకుల బృందమొకటి గూగుల్ ఫలితాలు ఎలా దుర్వినియోగమవుతున్నాయనేది విశ్లేషించింది. సాధారణంగా సమాచారాన్ని కోరే జర్నలిస్టులతో సహా నె టిజన్లు గూగుల్ సెర్చ్ ఫలితాల్లో మొదటి పేజీపైనే ఎక్కువగా ఆధారపడతారు. ఆ పేజీలో లేనివి అంత ప్రాధాన్యం లేనివని భావిస్తారు. గూగుల్ తనకు అవసరమైనవి, ప్రకటనలు ఇక్కడ చూపిస్తే... ఆ రకంగా దుర్వినియోగం జరిగినట్టే. గూగుల్ ఫలితాల తొలి పేజీలో తమ వెబ్‌సైట్లు కనిపించకుండా పోవడంతో మై ట్రిగ్గర్స్ డాట్ కామ్ వంటి పలు సంస్థలు, సర్ బ్రియాన్ సూటర్ వంటి వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ జరిగాక 2012 మేలో గూగుల్ ఒక ప్రకటన చేసింది. తాము సెర్చ్ ఫలితాలకు, ప్రకటనలకు మధ్య స్పష్టమైన విభజనను కొనసాగించలేమని పేర్కొంది. అందుకే ఇపుడు ఏదైనా ఉత్పత్తి కోసం సెర్చ్ చేస్తే... దానికి సంబంధించిన ప్రకటనలు ముందు దర్శనమిస్తాయి.
 
 యూట్యూబ్‌పై విమర్శలు.. నిషేధాలు
 వీడియో షేరింగ్ వెబ్‌సైట్ ‘యూ ట్యూబ్’ను 2006లో గూగుల్ కొనుగోలు చేసింది. దీన్లో కాపీరైట్ ఉల్లంఘించిన వీడియోల తో పాటు... పోర్నోగ్రఫీ, చట్టవిరుద్ధ చర్యల, హేట్ స్పీచ్‌ల వీడియోల్ని నిషేధించింది. యూజర్లెవరైనా ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తే... ‘ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది గనక లభ్యం కాదు’ అనే మెసేజ్‌తో వీటిని తొలగించడం ఆరంభించింది. అయితే కంటెంట్‌ను పర్యవేక్షించటంలో విఫలమైందంటూ యూట్యూబ్‌ను పలు ప్రభుత్వాలు విమర్శించాయి. హింసను ప్రేరేపించేవి, దురుద్దేశాలతో అప్‌లోడ్ చేసినవి కూడా ప్రత్యక్షమవుతున్నాయని పేర్కొన్నాయి. దీంతో పలు ప్రభుత్వాలు దీన్ని నిషేధించాయి.

⇒ 2006లో థాయ్‌లాండ్ యూట్యూ బ్ సేవల్ని బ్లాక్ చేసింది. థాయ్ ఐపీ అడ్రస్‌లతో యాక్సెస్ చేసుకునేవారికి అందుబాటులో లేకుండా చేసింది.
⇒ 2007లో ముస్తఫా కెమల్ అటాటర్క్‌ను అవమానించేవిగా ఉన్న వీడియోలను పబ్లిష్ చేసినందుకు యూట్యూబ్‌ను దేశంలో నిషేధించాలని టర్కీ జడ్జి ఒకరు ఆదేశించారు.
⇒ 2008 ఫిబ్రవరి 22న ప్రభుత్వాదేశాల మేరకు పాకిస్తాన్ టెలి కాం అథారిటీ యూట్యూబ్ యాక్సెస్‌ను ప్రాంతీయంగా నిషేధించటానికి ప్రయత్నించింది. దీంతో రెండు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ఎవ్వరికీ అందుబాటులోకి లేకుండా పోయింది. యూట్యూబ్ కొన్ని మత వ్యతిరేక వీడియోలు తొలగించటంతో 4 రోజుల అనంతరం పీటీఏ ఈ నిషేధాన్ని తొలగించింది.
 
 గూగుల్ ఉత్పత్తులను నిషేధించిన దేశాలు...
  పాకిస్తాన్..
  యూట్యూబ్: 2012 సెప్టెంబర్ 17 నుంచీ
 ఇరాన్..
  గూగుల్ సైట్స్: 2014 ఏప్రిల్ 7 నుంచీ
  యూట్యూబ్: 2009 జూన్ 13 నుంచీ
 చైనా..
  2014 డిసెంబర్ 25 నుంచి ఇప్పటి వరకూ గూగుల్ సెర్చ్, జీమెయిల్, గూగుల్ సైట్స్, పికాసా వెబ్ ఆల్బమ్స్, యూట్యూబ్‌లను నిషేధించింది.
  2014 డిసెంబర్ 25 నుంచీ జీ-మెయిల్
  2014 మే 31 నుంచీ గూగుల్ సెర్చ్
  2009 అక్టోబర్ 11 నుంచీ గూగుల్ సైట్స్
  2009 జూలై 16 నుంచీ పికాసా వెబ్ ఆల్బమ్స్
  2009 మార్చి 23 నుంచీ యూట్యూబ్
 తజకిస్తాన్..
  యూట్యూబ్: 2015 ఆగస్టు 25 నుంచి
 ఉత్తర కొరియా..
  దేశీ ఇంటర్నెట్ మాత్రమే లభ్యం. ప్రపంచంతో కనెక్షన్ ఉండదు.
 
 గూగుల్ ఉత్పత్తుల గురించి అందరికీ తెలుసు. వాటి ఉపయోగం కూడా తెలియంది కాదు. ఇంటర్నెట్ మొత్తం గూగుల్ మయమే. గూగుల్‌కు మరో కోణం మాత్రం కాస్త ఇబ్బంది కరంగానే ఉంటుంది. దీనిపై ఇప్పటికే పలు విమర్శలు కూడా వచ్చాయి. సెర్చ్‌లో తనకున్న ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, నమ్మక ద్రోహానికి పాల్పడుతోందని చాలా విమర్శలున్నాయి. ఆండ్రాయిడ్‌ను చూస్తే ఇది గూగుల్ అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని ఎవరైనా మార్చి, అభివృద్ధి చేయొచ్చు. అందుకే దీనిపై పలువురు డెవలపర్లు యాప్‌లను అభివృద్ధి చేయటం వంటివి చేస్తున్నారు. కంపెనీలూ ఈ ఓఎస్‌లో తమ ఉత్పత్తులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నాయి. కాకపోతే గూగుల్ తన ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ మొత్తాన్ని తన చేతిలో పెట్టుకుంది. ఏ యాప్ కావాలన్నా ప్లేస్టోరే శరణ్యం. దీనికి పరాకాష్ట ఏమిటంటే... మీ మొబైల్ ఫోన్లో మీరు దేన్నయినా తొలగించగలరుకానీ గూగుల్ సేవల్ని మాత్రం తొలగించలేరు. ఇంకా గూగుల్ బుక్స్‌లో అనుమతి లేని పుస్తకాలను కూడా స్కాన్ చేసి విక్రయిస్తోందని, మ్యాప్స్‌లో యూజర్లంతా ప్రాంతాలు గుర్తిస్తే... వాటితో తాను వ్యాపారం చేస్తోందని, డెవలపర్స్‌కు తాను అందిస్తున్న అనలిటిక్స్, గూగుల్ ఫాంట్స్, గూగుల్ ఏపీఐల ద్వారా  ఇంటర్నెట్ యూజర్ల గురించి సమాచారం సేకరిస్తోందని పలు విమర్శలున్నాయి.
 - సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Advertisement
Advertisement