పకడ్బందీ విచారణ

29 Aug, 2013 00:58 IST|Sakshi
ముంబై: మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై అత్యాచారం కేసును పకడ్బందీగా విచారించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ‘అవును, న్యాయ విధానంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే కేసు దారి తప్పకుండా పకడ్బందీగా విచారించేలా చర్యలు తీసుకుంటామ’ని ఆయన మంత్రాలయలో బుధవారం విలేకరులకు తెలిపారు. నిందితుడిని శిక్షిస్తామని, ఇతరులకు గట్టి సంకేతాలు పంపేలా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్‌తో సంప్రదింపుల తర్వాత ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. అత్యాచారానికి సంబంధించిన అనేక ఫిర్యాదులు అందడం లేదన్నారు. 
 
 ఈ అత్యాచార కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో త్వరితగతిన విచారించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అలాగే ప్రముఖ సంఘ సంస్కర్త నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో నిందితులను, అసలు సూత్రదారుల పేర్లను త్వరలోనే బయటపెడతామన్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు సాగుతుందన్నారు. అయితే రూపాయి విలువ పతనంతో కుదేలవుతున్న పరిశ్రమలను ప్రగతి బాట పట్టించేందుకు కేంద్రం ప్రత్యేక ఉద్దీపనం ప్రకటించొచ్చని అన్నారు. పరి శ్రమల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 
 
మరిన్ని వార్తలు