వీడిన మిస్టరీ

17 Aug, 2013 23:51 IST|Sakshi

 సాక్షి, చెన్నై: ధర్మపురికి చెందిన దివ్య, ఇళవరసన్ కులాంతర వివాహం, ఘర్షణల విషయం తెలిసిందే. దివ్య తల్లి దగ్గరికి చేరడంతో ఇళవరసన్ మానసికంగా కుంగిపోయూడు. ఈ క్రమంలో రైలు పట్టాలపై ఇళవరసన్ మృతదేహం కనిపించింది. ఇది ముమ్మాటికీ హత్యేనంటూ మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. దీంతో మృతదేహానికి రెండు సార్లు పోస్టుమార్టం నిర్వహించాల్సి వచ్చింది. తొలిసారి నివేదికకు, రెండో సారి నివేదికకు మధ్య కాస్త తేడా ఉండడంతో హత్యేనన్న వాదనకు బలం చేకూరినట్లు అయింది. తలకు బలమైన గాయం తగలడం వల్లే మరణించినట్లు నివేదిక స్పష్టం చేయడంతో ఎవరైనా దాడి చేశారా అనే అనుమానాలు బయలుదేరారుు.
 
 నివేదిక సమర్పణ: ధర్మపురి ఎస్పీ అష్రాకార్గ్ నేతృత్వంలోని విచారణ బృందం హైకోర్టుకు శనివారం నివేదిక సమర్పించింది. ఇందులో దివ్య తన తల్లి తేన్‌మొళి వెంట నడిచిన రోజు నుంచి జరిగిన పరిణామాలు, ఇళవరసన్ ఫోన్ సంభాషణలు, అతడు రాసిన లేఖలు తదితర అంశాల్ని వివరించారు. దివ్య తన తల్లి వెంట వెళ్లిన రోజున చెన్నై టీ.నగర్‌లోని ఓ హోటల్ గదిలో చేతిని కోసుకుని ఇళవరసన్ ఆత్మహత్యకు యత్నించాడని పేర్కొన్నారు. ఇందుకు ఆ హోటల్ బాయ్ సంతోష్ మెహ్రా ఇచ్చిన వాంగ్మూలాన్ని జత చేశారు. మరణించేందుకు ముందుగా చెన్నైలోని స్నేహితుడు మనోజ్, చిత్తూరులోని మరో స్నేహితుడు కార్తీక్‌లతో ఫోన్‌లో మాట్లాడాడని తెలిపారు. అంతకు ముందు దివ్యతోనూ మాట్లాడినట్లు వివరించారు. ఇందుకు తగ్గ ఫోన్ సంభాషణల్ని కోర్టుకు సమర్పించారు.
 
 ఆత్మహత్యే: తాను ఆత్మహత్య చేసుకోనున్నానని, మరణించిన తర్వాత తనకు తాజ్ మహల్ తరహాలో స్మృతివనం ఏర్పాటు చేయాలని ఇళవరసన్ తన స్నేహితులను కోరారని నివేదికలో వివరించా రు. ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ఓ చెట్టు కింద ఇళవరసన్ మద్యం సేవించాడని, అతడు మద్యం సేవించినట్లు సేలం నిపుణులు నివేదిక సమర్పించారని గుర్తు చేశారు. అతడి శరీరంలో భాగాల్లో ఎలాంటి విష పదార్థాలూ లేవని స్పష్టం చేశారు. తాను ఆత్మహత్య చేసుకోనున్నట్టు, తన మరణానికి కారకులు ఎవరూ కారని స్వహస్తాలతో తండ్రి ఇలంగోవన్, ప్రియురాలు దివ్యకు ఇళవరసన్ నాలుగు పేజీల లేఖ రాశాడని వివరించారు. ఈ లేఖను సంఘటన స్థలం నుంచి ఇళవరసన్ బంధువు అరివలగన్ మాయం చేశాడన్నారు. తర్వాత విచారణలో లేఖ బయట పడిందని కోర్టు దృష్టికి తెచ్చారు.
 
 ఆధారాలు లేవు: జరిగిన పరిణామాలు, లభించిన సమాచారం మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని, అయితే ఎక్కడా హత్య అని నిర్ధారించేందుకు ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. మద్యం సేవించి రైలుకు ముందు దూకడంతో అతని తల వెనుక భాగానికి గాయం ఏర్పడిందని వివరించారు. అందువల్లే మరణించాడని స్పష్టం చేశారు. విచారణ బృందం నివేదిక నేపథ్యంలో ఇళవరసన్ మృతి మిస్టరీ వీడిందని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు