డిప్యూటీ సీఎంను బెదిరించలేదు: లోకేశ్

8 Oct, 2016 18:41 IST|Sakshi
డిప్యూటీ సీఎంను బెదిరించలేదు: లోకేశ్

హైదరాబాద్: టీడీపీ వర్క్ షాప్ లో తాను ప్రజంటేషన్ ఇస్తుండగా డిప్యూటీ సీఎం చినరాజప్ప వివరణ ఇస్తూ ఒక అభిప్రాయం చెప్పారే తప్ప అక్కడ ఏమీ జరగలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ శనివారం విడుదల చేసిన ఓ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. తాను చినరాజప్పను బెదిరించలేదని తెలిపారు. చినరాజప్ప భయపడటం అన్న దానికి ఆస్కారమే లేదన్నారు. ఇదంతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జీల సమక్షంలో జరిగిందని పేర్కొన్నారు. చిన రాజప్పతో తనకు ఉన్నది అభిమాన పూర్వక సంబంధాలేనని చెప్పారు.

"బీజేపీ సమావేశాల్లో పార్టీ నాయకులు వేదిక మీద ఉంటే కేంద్ర మంత్రులు కూడా సభలో కూర్చుంటున్నారు. ఏ పార్టీలోనైనా ఇదే జరుగుతుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను పార్టీ వేదికలలో ప్రజంటేషన్ ఇవ్వడానికి వేదిక మీద ఉంటే మంత్రులు సభలో కూర్చోవడం సహజం. దీనిపైన కూడా నిందలు వేసి ప్రచారం చేయడం మీ అసూయ, విద్వేష స్వభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నానంటూ నాపై నిందలు వేస్తే మీ పాపాలు తొలగిపోతాయా?" అని బహిరంగ లేఖలో లోకేశ్ పేర్కొన్నారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తే అసూయ, విద్వేష రాజకీయాలకు మీరే నగుబాట్లవుతారని ప్రతిపక్షాన్ని దుయ్యబట్టారు.

>
మరిన్ని వార్తలు