ఆత్మహత్యలు వద్దు

11 Aug, 2015 02:16 IST|Sakshi
ఆత్మహత్యలు వద్దు

రైతులకు మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ మహాస్వామీజీ హితవు
రైతులకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలి
 

బళ్లారి : దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతన్నలు ఎట్టి పరిస్థితుల్లోను ఆత్మహత్యలు చేసుకోకూడదని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ మహా స్వామీజీ పేర్కొన్నారు. ఇటీవల బళ్లారి తాలూకా కప్పగల్లు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు ఏ.మల్లయ్య, దాదావలి కుటుంబాలను ఆదివారం రాత్రి స్వామీజీ పరామర్శించి సాంత్వన పలికారు. మంత్రాలయం స్వామీజీతో పాటు కురుగోడు మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి తదితరులు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఇద్దరి కుటుంబాలకు ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు. మంత్రాలయం మఠం నుంచి బియ్యం, బ్యాళ్లు, బెల్లం తదితర నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ దేశానికి రైతులే వెన్నెముకలాంటి వారని గుర్తు చేశారు.

అలాంటి వెన్నెముక విరిగిపోతే దేశం ముందడుగు వేయలేదన్నారు. అన్నదాత ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఆత్మహత్యలే సమస్యకు పూర్తి పరిష్కారం కాదన్నారు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల వారిని నమ్ముకున్న కుటుంబం కష్టాల్లోకి నెట్టినట్లు అవుతుందన్నారు. కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు ఇలా ప్రతి ఒక్కరినీ బాధల్లోకి తీసుకెళతారని గుర్తు చేశారు. మనిషి జన్మ ఎంతో  ఉత్తమమైనది, భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలన్నారు. చావు,పుట్టుకలు రెండు భగవంతునికే వదిలి వేయాలన్నారు. జన్మనివ్వడం, తీసుకెళ్లడం ఆయన  చేతుల్లో ఉంటుందన్నారు. అయితే ఇటీవల కొందరు ఇలా బలవన్మరణాలు చేసుకోవడం ద్వారా తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవడం మహాపాపమన్నారు. కష్టాలను ఈదుతూ జీవనాన్ని సాగించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పోతుంటాయని, అయితే వాటిని చూస్తూ భయపడకూడదన్నారు. ధైర్యంగా ఎదుర్కొని జీవనాన్ని సాగించాలన్నారు. కష్టాలు వచ్చినప్పుడు బంధువులు లేదా స్నేహితుల వద్ద చెప్పుకుని వాటికి పరిష్కార మార్గం కోసం అన్వేషించాలని సూచించారు. ఆయా ప్రాంతాలకు చెందిన ముఖ్యులు, ఆర్థికంగా బాగా స్థిరపడిన వారి వద్దకు కూడా వెళ్లి తమ బాధలను చెప్పుకోవాలని సూచించారు.
 
 
 

మరిన్ని వార్తలు