ఈ నెలంతా చలే...

13 Dec, 2013 02:40 IST|Sakshi
ఈ నెలంతా చలే...

‘మాది’ ఎఫెక్ట్ ..
 = గణనీయంగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు
 = రాత్రంతా చలి.. పగలంతా ఎండ
 = ప్రబలనున్న జలుబు, చర్మ వ్యాధులు
 = అలర్జీ, ఉబ్బసం వారికి ‘పొగమంచు’ గండం

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో చలి పంజా విసిరింది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రాత్రి నుంచి తెల్లారి వరకు ఎముకలు కొరికే చలి, తర్వాత సాయంత్రం వరకు భగ భగ మండే ఎండలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తెల్లారే సరికి పరుపులు, దిండ్లు దాదాపుగా నీటిలో తడిసినట్లు చల్లబడి పోతున్నాయి. స్వెటర్లు, మంకీ క్యాప్‌లు, జెర్కిన్లతో చలి పులి నుంచి కాచుకోవడానికి పౌరులు తలమునకలుగా ఉన్నారు. ఇలాంటి వాతావరణం వల్ల జలుబు, చర్మ రోగాలు అధికమవుతున్నాయి.

ఉబ్బసంతో బాధ పడుతున్న వారు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా చలి కాలంలో ఉదయం పూట బాగా మంచు పడే అవకాశం ఉన్నందున, అలర్జీ, ఉబ్బసంలతో బాధ పడుతున్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. చలి కాలంలో తలుపులు, కిటికీలను మూసి వేసి ఉన్నందు వల్ల శుభ్రమైన గాలి కొరతతో ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి విరుగుడుగా అప్పుడప్పుడు తలుపులు లేదా కిటికీలను తెరుస్తూ, మూస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

మరో వైపు బెంగాల్‌కు నైరుతిగా ఏర్పడిన ‘మాది’ తుఫాను కారణంగా చలి విపరీతమైంది. దీని ప్రభావం వల్ల పగటి ఉష్ణోగ్రత లు ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువై, రాత్రి ఉష్ణోగ్రతలు అదే విధంగా తగ్గుతున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశ మం మేఘావృత్తమై చలి గాలులు వీచాయి. ఇదం తా ‘మాది’ ప్రభావమేనని, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది.
 

మరిన్ని వార్తలు