పోలీసులే దొంగలు

23 Sep, 2016 11:20 IST|Sakshi
పోలీసులే దొంగలు
  •  రూ.4 కోట్లు సొమ్ము హాంఫట్
  •  సీఐ, ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్ అరెస్ట్
  •  రూ.60 లక్షలు రికవరీ
  •  ముగ్గురిని సస్పెండ్ చేసిన డీజీపీ
  •  
    దొంగలను పోలీసులు పట్టుకుంటారు. మరి పోలీసులే దొంగలైతే. తమిళనాడులో ఇదే జరిగింది. రూ.4 కోట్ల హవాల సొమ్మును చల్లగా కాజేసిన పోలీసులు అధికారులు పట్టుబడ్డారు. ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి రూ.60 లక్షల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
     
    చెన్నై: కేరళ రాష్ట్రం మలైపురానికి చెందిన అన్వర్‌సాదాత్ (35) బంగారు నగల వ్యాపారి. ఇతని జ్యువెలరీ షాపులో గుమాస్తాగా పనిచేసే మహ్మమద్ (53) సిదోష్ (39), ఆనంద్ (29) గత నెల 25వ తేదీన చెన్నై నుంచి కోయంబత్తూరు మీదుగా పాలక్కాడుకు కారులో వెళుతున్నారు.  మదుకరై నీలంపూర్ బైపాస్ రోడ్డులో వెళుతుండగా పోలీసు జీపు వారి కారును అడ్డగించింది.
     
     ఆ జీపు నుంచి పోలీసు దుస్తుల్లో దిగిన నలుగురు వ్యక్తులు కారులోని వారిని కిందకు దింపివేసి కారును ఎత్తుకెళ్లారు. ఆ కారులో వెయ్యి రూపాయి నోట్‌తో కట్టలు కట్టలుగా ఉన్న రూ.3.9 కోట్లను సైతం దోచుకున్నారు. కేరళకు చెందిన బాధితులు మధుకరై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి కేరళ రాష్ట్రం తిరుచూరుకు చెందిన సుధీర్ (33), సుభాష్ (43), మలప్పురం జిల్లాకు చెందిన సబీక్ (28)లను అనుమానంపై ఈనెల 20 వ తేదీన తమిళనాడు పోలీసులు తిరుచూరులో అదుపులోకి తీసుకున్నారు.
     
    హవాలా సొమ్ము ఎత్తుకెళ్లడంపై మనుషులను గుర్తించే ఇన్‌ఫార్మర్లుగా వారిని గుర్తించారు. వీరికి తిరుచూరులోని హవాలా సొమ్ము స్మగ్లర్ శ్రీధర్ (60)తో సంబంధాలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. శ్రీధర్‌కు కరూరు జిల్లా పరమత్తి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ముత్తుకుమార్ (47), కులిత్తలై పోలీసుస్షేషన్ ఎస్‌ఐ శరవణన్, వేలాయుధ పాళయం పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ ధర్మేంద్రన్ అండదండలు ఇస్తున్నట్లు విచారణలో తేలింది.
     
    ఈ పోలీసు బృందం శ్రీధర్ కారును ఎత్తుకెళ్లి మొత్తం సొమ్మును కాజేసే ప్రయత్నం చేశారు. సుభాష్, సబీక్ ఇచ్చిన సమాచారంతో ఈనెల 20వ తేదీ రాత్రి ఇన్స్‌పెక్టర్ ముత్తుకుమార్‌ను ప్రత్యేక పోలీసు బృందం అరెస్ట్ చేసి విచారణ జరుపుతోంది. ఇన్‌స్పెక్టర్ అరెస్టయిన సంగతిని తెలుసుకున్న ఎస్‌ఐ శరవణన్, హెడ్‌కానిస్టేబుల్ ధర్మేంద్రన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
     
    పరారైన వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తుండగా కరూరు సమీపంలోని ఒక ఇంటిలో దాక్కుని ఉన్న ఇద్దరిని గురువారం ఉదయం ప్రత్యేక పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన పోలీసు అధికారుల నుంచి రూ.60 లక్షల హవాలా సొమ్మును రికవరీ చేశారు. పట్టుబడిన ముగ్గురు పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంలో నిందితులతో స్నేహం తదితర వివరాలను వెల్లడించారు.
     
     హవాలా స్మగ్లర్‌తో స్నేహం ఎలాగంటే..
     కన్యాకుమారి జిల్లాలో ముత్తుకుమార్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేటపుడు శ్రీధర్‌ను అరెస్ట్ చేశాడు. ఆనాటి నుండి ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఇద్దరు కలిసి నగదు దోపిడీకి పథకాలు పన్నేవారు. హవాలా సొమ్మును చేరవేస్తున్న కారు, జీపుల సమాచారాన్ని ఇన్‌ఫార్మర్లు శ్రీధర్‌కు తెలుపుతారు. ఈ సమాచారాన్ని శ్రీధర్ ఇన్స్‌పెక్టర్ ముత్తుకుమార్‌కు చేరవేస్తారు. ముత్తుకుమార్ బృందం సదరు కారును తనిఖీ పేరుతో ఆపి ఎత్తుకెళతారు. సొమ్మును శ్రీధర్ స్వాధీనం చేసుకున్న తరువాత ముగ్గురు పోలీసు అధికారులకు పంచుతాడు. హవాలా సొమ్ముతో సహా కారు లేదా జీపులను ఎవరైనా ఎత్తుకెళ్లితో వాహనం పోయిందని మాత్రమే ఫిర్యాదు చేస్తారు. హవాలా సొమ్ము కావడంతో బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొనడు.
     
     ఈసారి కూడా అలానే ఫిర్యాదు చేశారు. పోలీసులు కారును మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. కారును నడిపిన డ్రైవర్ అనుమానించే రీతిలో మాట్లాడంతో తాము పట్టుబడ్డామని పోలీసు అధికారులు వాపోయారు. పట్టుబడిన పోలీసు అధికారులు ఇలా అనేక దోపిడీల్లో పాల్గొని ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు పోలీసు అధికారులను డీజీపీ సస్పెండ్ చేశారు.
     

మరిన్ని వార్తలు