రాష్ర్టంలో ఆర్థిక సంక్షోభం

10 Oct, 2013 03:43 IST|Sakshi

 పరిస్థితిపై శ్వేత పత్రం : యడ్డి డిమాండ్  
 =  అభివృద్ధి పనులు స్తంభించాయి    
 =  20 ఏళ్లలో ఇలాంటి దుస్థితి చూడలేదు
 =  సీఎంపైనే ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదా?   
 =  బాధ్యతారహితంగా మాట్లాడుతున్న కేపీసీసీ చీఫ్

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని, అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించిపోయాయని కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఆరోపించారు. దీనిపై తక్షణమే శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుల్బర్గలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

గత 20 ఏళ్లలో ఇంతటి దారుణమైన ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదన్నారు. అభివృద్ధి పథకాలు స్తంభించిపోవడానికి కారణాలేమిటో వివరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పని తీరుపై అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పెదవి విరుస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేలే అధిష్టానానికి ఫిర్యాదు చేసేంత వరకు పరిస్థితి వెళ్లిందని అన్నారు. సాక్షాత్తు లోకాయుక్త ‘ఈ ప్రభుత్వంలో లంచం ఇవ్వనిదే పనులు జరగడం లేదు’ అని వ్యాఖ్యానించారని అన్నారు.

రైతుల రుణ మాఫీని ఇంకా పూర్తిగా అమలు చేయలేదన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మైనారిటీలు రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టవచ్చంటూ ఆయన సలహా ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కాగా బీజేపీలో చేరే విషయమై ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానాన్ని దాటవేశారు.

కేజేపీ మనుగడను కాపాడుకుంటామని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలనే ఏకైక ఉద్దేశంతో బీజేపీతో మద్దతుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. అయితే దీనిపై ఎవరూ తనతో చర్చించలేదని ఆయన చెప్పారు.
 

మరిన్ని వార్తలు