రియల్టర్ ఆత్మహత్య

10 Jun, 2014 03:17 IST|Sakshi
  • మృతుడు విశ్రాంత పోలీస్ అధికారి కుమారుడు
  •  తండ్రి రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం
  • బెంగళూరు : విశ్రాంత పోలీస్ అధికారి కుమారుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్‌టీ నగర పోలీసుల సమాచారం మేరకు... విశ్రాంత డీసీపీ రామయ్య కుమారుడు రాఘవేంద్ర (34). రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అతను ఇసుక దందా చేస్తున్నాడు. సోమవారం ఉదయం తన ఇంటి నుంచి స్కార్పియో వాహనంలో బయటకు వచ్చిన అతను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆర్‌టీ నగరలోని తరళబాళు రోడ్డులో ఉన్న ఓ పెద్ద భవనం పక్కన వాహనాన్ని ఆపించాడు.

    అనంతరం తన డ్రైవర్ మంజునాథ్‌కు ఓ సీల్డ్ కవర్ ఇచ్చి ఇంటిలో ఇవ్వమని పంపాడు. ఓ ఆటోలో మంజునాథ్ వెళ్లిపోయిన తర్వాత స్కార్పియోలోనే కూర్చొని రివాల్వర్‌తో ఎదపై కాల్చుకున్నాడు. మధ్యాహ్నం 2.15 గంటలకు అటుగా వెళ్తున్న వారు స్కార్పియో లోపల రక్తపు మడుగులో పడి ఉన్న రాఘవేంద్రను చూసి పోలీసులకు సమాచారం అందించారు.

    అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే రాఘవేంద్రను కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న బెంగళూరు నగర అదనపు పోలీస్ కమిషనర్ కమల్‌పంత్, డీసీపీ సందీప్ పాటిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు తన తండ్రి రామయ్యకు చెందిన లెసైన్స్ రివాల్వర్‌తో కాల్చుకున్నట్లు గుర్తించారు.

    ఇంటికి పంపిన సీల్డ్ కవర్‌లో నాలుగు ఉత్తరాలు ఉన్నాయని డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. తండ్రి, తల్లి, భార్య, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వేర్వేరుగా ఉత్తరాలు రాసినట్లు వివరించారు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. కాగా, రాఘవేంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
     

మరిన్ని వార్తలు