రూ.వెయ్యి కోట్ల అవినీతి

1 Aug, 2015 02:14 IST|Sakshi

♦ బంధువులకు ప్రాజెక్టులు కట్టబెట్టిన అజిత్‌పవార్
♦ ఆరోపించిన సామాజిక కార్యకర్త అంజలి
 
 సాక్షి, ముంబై : రూ.వెయ్యి కోట్లతో కూడిన నాలుగు సాగునీటి ప్రాజెక్టులను మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన దగ్గరి బంధువులకు కట్టబెట్టారని సామాజిక కార్యకర్త అంజలి దమానియా ఆరోపించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుల కాంట్రాక్టు బాధ్యతలు కట్టబెట్టడానికి అనేక నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. బీడ్ జిల్లా ఆష్టీ తాలూకాలోని ఓ రైతు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు సేకరించడంతో ఈ విషయాలు బయట పడ్డాయని చెప్పారు. ‘నాలుగు భారీ జలాశయాలకు 20 చెక్ డ్యాంల నిర్మాణ పనులను రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీకి జగదీశ్ కదం, రామ్ నింబాల్కర్ యజమానులు. సహ యజమాని జగదీశ్ కదం అజిత్ పవార్‌కు స్వయానా మేనమామ కొడుకు’ అని వివరించారు.

 ఎక్కడి నుంచి నీరు తెస్తారు..?
 ‘ఆష్టీ తాలూకాలో చెక్‌డ్యామ్ ప్రాజెక్టు చేపట్టడానికి భూమిని సేకరించారు. నిజానికి గత కొన్నేళ్ల నుంచి వర్షాలు లేకపోవడంతో ఆష్టీ తాలూకాను కరువు ప్రాంతంగా ప్రకటించారు. అసలు వర్షాలు కురవని అలాంటి ప్రాంతంలో నీటిని నిల్వ చేసేందుకు చెక్ డ్యాం ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఏమోచ్చింది. అందులో నిల్వ చేసేందుకు నీరు ఎక్కడి నుంచి తెస్తారు’ అని అంజలి ప్రశ్నించారు. ‘అప్పట్లో ఈ విషయంపై ప్రశ్నించేందుకు స్థానిక రైతులు కూడా నడుం బిగించారు. 295 కి.మీ. దూరంలో ఉన్న ఉజనీ డ్యాం నుంచి నీటిని తీసుకొస్తామని అజిత్ పవార్ చెప్పారు. కాని అందుకోసం పైప్‌లైన్ లేదా కాల్వ పనులు చేపట్టక ముందే రూ.4800 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. ఈ విషయం బయటకు పొక్కగానే రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వెబ్ సైట్ గురువారం రాత్రి నుంచి నిలిపివేశారు’ అని ఆరోపించారు.

మరిన్ని వార్తలు