వంట గ్యాస్ సబ్సిటీ బదిలీ విస్తరణ

6 Sep, 2013 02:09 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని మరో 23 జిల్లాల్లో వంట గ్యాస్ సబ్సిడీని ఆయా కస్టమర్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసే (డీబీటీఎల్) పథకం ప్రారంభం కానుంది. రాష్ర్టంలో ఇదివరకే తుమకూరు జిల్లాలో జూన్ ఒకటి నుంచి, మైసూరు జిల్లాలో జూలై ఒకటి నుంచి ఈ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పథకం ప్రారంభమయ్యే జిల్లాల్లోని గ్యాస్ వినియోగదారులు మూడు నెలల్లోగా ఆధార్ సంఖ్య ద్వారా గ్యాస్ వినియోగదారు సంఖ్యను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ మూడు నెలల కాలంలో వినియోగదారులకు సబ్సిడీ ధరపైనే వంట గ్యాస్ లభిస్తుంది. తదనంతరం వినియోగదారులు తమ డీలర్ల వద్ద మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ఆయా వినియోగదారుల ఖాతాలకు ప్రభుత్వం నేరుగా  జమ చేస్తుంది. దీనిపై ఇంకా ఏవైనా అనుమానాలుంటే  http://www.petroleum.nic.in/dbtl/-http://www.petroleum.nic. in/dbtl/ వెబ్‌సైట్‌ను సందర్శించి నివృత్తి చేసుకోవచ్చు. గ్యాస్‌పై సబ్సిడీ వద్దనుకుంటే ఆధార్ సంఖ్య అవసరం లేదు.

పథకం ప్రారంభమయ్యే జిల్లాల్లోని వంట గ్యాస్ వినియోగదారులు ఆధార్ సంఖ్యను పొందడం ద్వారా గ్యాస్ వినియోగదారు సంఖ్యను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలని అధికారులు కోరారు. ధార్వాడ, ఉడిపి, ఉత్తర కన్నడ జిల్లాల్లో అక్టోబరు 1న, ఉత్తర కన్నడ, గదగ జిల్లాల్లో నవంబరు 1న, బెంగళూరు, హావేరి, కొప్పళ, బీదర్, దావణగెరె, బిజాపుర జిల్లాల్లో డిసెంబరు 1న, చిక్కబళ్లాపురం, బెల్గాం, బెంగళూరు గ్రామీణ, బాగలకోటె, చిక్కమగళూరు, గుల్బర్గ, దక్షిణ కన్నడ, కొడగు, బళ్లారి, మండ్య, కోలారు, రామనగర, చామరాజ నగర జిల్లాల్లో వచ్చే ఏడాది జనవరి 1న పథకం ప్రారంభవుతుంది.
 

మరిన్ని వార్తలు