పవిత్ర ప్రేమకు ‘మతం’ అడ్డు

16 Apr, 2016 08:58 IST|Sakshi
పవిత్ర ప్రేమకు ‘మతం’ అడ్డు

తల్లిదండ్రులు సమ్మతించినా అడ్డుపడుతున్న కులసంఘాలు
బైక్ ర్యాలీకి సిద్ధమైన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న
  మండ్య పోలీసులు
ప్రేమికులకు మద్దతుగా ‘ప్రగతిపర వేదిక’

 

బెంగళూరు: వారి ప్రేమకు మతాలు అడ్డంకి కాలేదు. 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఆ ఇద్దరూ కెరీర్‌లో స్థిరపడ్డాక తల్లిదండ్రులను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబాలు వివాహానికి సమ్మతించడంతో ఆ కుటుంబాల్లో, ప్రేమికుల హృదయాల్లో ఆన ందోత్సాహాలు వెల్లివిరుస్తున్న వేళ కులసంఘాలు వారి ప్రేమకు అడ్డుపడుతున్నాయి. ఆ ప్రేమికులది నిజమైన ప్రేమకాదని, ప్రేమ పేరిట జరుగుతున్న లవ్‌జిహాది అని గోలపెడుతున్నాయి. వీరి పెళ్లి ఎట్టిపరిస్థితుల్లోనూ జరగరాదని మండ్యలోని ఒక్కలిగర సంఘానికి చెందిన కార్యకర్తలు శుక్రవారం మండ్య నగరంలో బైక్ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. దీంతో ఆ ప్రేమజంట ఒక్కటయ్యేందుకు ‘మతం’ అడ్డుగోడగా మారుతోంది.

 

12 ఏళ్ల ప్రేమ......

మండ్య నగరంలోని అశోకనగర్‌లోని రెండవ క్రాస్‌లో నివాసం ఉంటున్న డాక్టర్ హెచ్,వి.నరేంద్రబాబు, గాందీనగరలో నివాసం ఉంటున్న బియ్యం వ్యాపారి ముఖ్తార్ ఆహ్మద్‌లు ఇద్దరు బాల్య స్నేహితులు. దాంతో నరేంద్రబాబు కుమార్తె అశితా, ముఖ్తార్ అహ్మద్ కుమారుడు షకిల్ చిన్నప్పటి నుంచి ఎంబీఎ వరకు కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు 12 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. దాంతో ఇరు కుటుంబాల వారు ఇద్దరి పెళ్లికి కూడా ఒప్పుకొని ఈ నెల 17న మైసూరు నగరంలోని తాజ్ కన్వెన్షన్ హాల్‌లో పెళ్లి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘటణ కార్యకర్తలు గత మంగళవారం యువతి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు.

 
ప్రేమ పేరిట హిందూ యువతిని ముస్లిం మతంలోకి మార్చి లవ్ జిహాదికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు. అయితే ఇందులో లవ్ జిహాది లాంటిదేదీ లేదని, తమ బిడ్డలు వివాహానంతరం కూడా మతం మారబోరని ఇప్పటికే ఇరు కుటుంబాలు ప్రకటించాయి. అయినప్పటికీ మండ్యలోని కొన్ని సంఘాలు, ఒక్కలిగర సంఘం సభ్యులు ఈ వివాహాన్ని అడ్డుకోవాలని కోరుతూ బైక్ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బైక్ ర్యాలీకి బయలు దేరిన 15 మందికి పైగా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా శనివారం మండ్య బంద్‌కు సైతం ఈ సంఘం సభ్యులు పిలుపునిచ్చాయి. ఇదే సందర్భంలో మండ్యలోని కొన్ని ప్రగతిపర సంఘాలు మాత్రం ఈ ప్రేమ జంట వివాహానికి మద్దతు తెలుపుతున్నాయి. ఈ ప్రేమ జంటకు తాము అండగా ఉంటామని చెబుతూ వారు సైతం మండ్యలో శుక్రవారం ర్యాలీని నిర్వహించారు.

 
మమ్మల్నిలా వదిలేయండి...

ఇక ఈ విషయంపై అశితా స్పందిస్తూ....‘మమ్మల్నిలా వదిలేయండి. మేమిద్దరం 12 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. కెరీర్‌లో స్థిరపడ్డాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నాం. ఇందులో నిజమైన ప్రేమ తప్పితే మరే విషయం లేదు. మా పెళ్లైన తర్వాత అత్తగారింట్లో రమ్‌జాన్ జరుపుకుంటాను, పుట్టింట్లో రామనవమి జరుపుకుంటాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు