జీవన భృతి పెంపు!

5 Aug, 2014 01:24 IST|Sakshi
జీవన భృతి పెంపు!

సాక్షి, చెన్నై:నిషేధకాలంలో రాష్ట్ర జాలర్లకు జీవన భృతిని పెం చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కాలంలో జాలర్లకు, మహిళా జాలర్లకు పరిహారంగా రూ.2700 అందజేయనున్నారు. మూడు చోట్ల చేపల దిగుమతి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కొల్లిడం నదిపై రూ.400 కోట్లతో రిజర్వాయర్, మరో 17 చోట్ల రూ.32 కోట్లతో చెక్ డ్యాంలను నిర్మించనున్నారు. పాల ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధికి రూ.46 కోట్లు కేటాయించారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటనలు చేశారు.  అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయం శాసన నియమావళి 110 ప్రకారం సీఎం జయలలిత మూడు ప్రత్యేక ప్రకట నలు చేశారు. ఇందులో ఒకటి జాలర్లకు నిషేధ కాలం పరిహా రం పెంచుతూ నిర్ణయించారు.
 
 మరొకటి వృథా అవుతున్న కొల్లిడం నదీ జలాల పరిరక్షణ లక్ష్యంగా రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. పాల ఉత్పత్తి పెంపు, కేంద్రాల అభివృద్ధి లక్ష్యంగా మూడో ప్రకటన చేశారు. రూ.900 పెంపు : చేపల వృద్ధి కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి మే 29 వరకు రాష్ట్రంలో చేపల వేటకు నిషేధ కాలం అమల్లో ఉంది. ఈ కాలంలో జాలర్లకు జీవన భృతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందజేస్తున్నారు. ప్రస్తుతం రూ.1800 అందజేస్తుండడంతో జాలర్లు పెదవి విప్పుతున్నారు. ఈ పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం జయలలిత అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటన ద్వారా రూ.2700గా ఆ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఇది వరకు ఇస్తున్న రూ.600ను రూ.900కు పెంచిందని గుర్తు చేశారు.
 
 ఈ దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం సైతం  రూ.900గా తమ భృతిని పెంచినట్లు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భృతి రూ.1800తో పాటుగా లబ్ధిదారుల పరిహార వాటా నిధి నుంచి రూ.900 చేర్చి మొత్తంగా రూ.2700 ఈ ఏడాది నుంచి ఇవ్వనున్నామని వివరించారు. రెండు లక్షల పది వేల మందికి ఈ పెంపు వర్తిస్తుందని, ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. ఆరు కోట్ల 30 లక్షలు అదనపు భారం పడనున్నదన్నారు. అలాగే, మహిళా జాలర్లకు ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1200, లబ్ధిదారుల నిధి నుంచి రూ.600 కలిపి రూ. 1800 ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని కూడా పెంచుతున్నామని ప్రకటించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1800, లబ్ధిదారుల నిధి నుంచి రూ.900 కలిపి రూ. 2700 ఇవ్వనున్నామని వివరించారు.
 
 లక్షా 90 వేల మహిళా జాలర్లకు ఈ పెంపు వర్తిస్తుందని, ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మీద రూ. 11 కోట్ల 40 లక్షలు అదనపు భారం పడనున్నదన్నారు. చేపల దిగుమతి పెంపు లక్ష్యంగా కాంచీపురం జిల్లా కోవళంలో రూ.5కోట్లతో, కన్యాకుమారి జిల్లా ఇరయాన్ తురైలో రూ.7కోట్లతో, తూత్తురులో రూ.4 కోట్లతో చేపల దిగుమతి కేంద్రాలను నెలకొల్పనున్నామని ప్రకటించారు. పరింగి పేట్టై, భవానీ సాగర్, వైగై డ్యాం, కొడెకైనాల్‌లలో చిన్న చే పల పెంపకం కేంద్రాల అభివృద్ధికి రూ.17 కోట్లు కేటాయిస్తున్నట్టు వివరించారు. రామనాథపురం, నాగపట్నంలలో మత్స్య శాఖకు అన్ని రకాల వసతులతో భవనాల్ని రూ.ఏడు కోట్లతో నిర్మించనున్నామని తెలిపారు.కొల్లిడంలో రిజర్వాయర్ : కావేరి నదీ పరవళ్లు తొక్కిన సమయాల్లో కొల్లిడం నదీ జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయి.
 
 కడలూరు, నాగపట్నం మీదుగా ప్రవహిస్తున్న ఈ నదీ జలాలను పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.400 కోట్లతో ఆదనూరు- కుమార మంగళం గ్రామాలను కలుపుతూ రిజర్వాయర్ నిర్మాణానికి జయలలిత ప్రకటన చేశారు. ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణంతో తాగు నీటి సమస్య పరిష్కారంతో పాటుగా, అన్నదాతలకు నీటిని అందించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తిరుచ్చి శ్రీరంగం వద్ద కావేరీ తీరంలో, ఇతర  నీటి ప్రవాహ ప్రాంతాలు 17 చోట్ల చెక్ డ్యాంల నిర్మాణానికి నిర్ణయించడంతో పాటుగా ఇందుకు గాను రూ. 32 కోట్లు కేటాయించామని ప్రకటించారు.
 
 పాల ఉత్పత్తి : పాల ఉత్పత్తిలో రాష్ట్రం దూసుకెళ్తోందని జయలలిత వెల్లడించారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తమిళనాడు పాల ఉత్పత్తిలో పెరెన్నిక గనిందన్నారు. తాము తీసుకుంటున్న చర్యలు ఇందుకు కారణంగా గుర్తు చేశారు. పాల ఉత్పత్తి మరింత పెంపుతో పాటుగా ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాల ఉత్పత్తి కేంద్రాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా రూ.46 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు