గుంపులో గోవింద!

24 May, 2016 02:57 IST|Sakshi
గుంపులో గోవింద!

సాక్షి, చెన్నై : రాష్ట్ర రాజకీయల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న శతృత్వ వైర్యంతో కూడిన సంస్కృతిని మార్చే దిశగా డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మద్రాసు వర్సిటీ సెంటినరీ హాల్‌లో జరిగిన సీఎం జయలలిత, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో స్టాలిన్ ప్రత్యక్షం అయ్యారు. సర్వత్రా ఇందుకు  హర్షం వ్యక్తం చేసినా, ఆయనకు  కనీస మర్యాద కూడా ఇవ్వక పోవడం వివాదానికి దారి తీసింది. ఎక్కడో గుంపులో గోవిందా... అన్నట్టుగా పన్నెండో వరుసలో కూర్చోబెట్టి ఆదిలోనే వివాదానికి ఆజ్యం పోశారు. స్టాలిన్ వెంట వచ్చిన ఎమ్మెల్యేలకు అడుగడుగునా భద్రత ఆటంకాలు తప్పలేదు.

డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య బద్ధశతృత్వం కొనసాగుతూ వస్తున్నది. ఈ సంస్కృతిని మార్చే దిశగా డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ అడుగులు వేస్తూ వస్తున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా ఎన్నికల ప్రచారాల్లో ఆయన వ్యవహరించిన విధానం , మాటతీరు, పలకరింపులు, స్టైలీష్ అవతారాలు  నిదర్శనంగా నిలిచాయి. రాజకీయంగా ఉన్నత స్థితికి చేరాలన్న కాంక్ష స్టాలిన్‌లో ఉన్నా, రాజకీయంగా ఇక్కడున్న వాతావారణాన్ని మార్చే విధంగా ముందుకు సాగే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే ప్రమాణ స్వీకారోత్సవాలకు ఎప్పుడూ దూరంగా ఉండే డీఎంకే వర్గాలు ఈ సారి హాజరవడం విశేషం.

2001లో చెన్నై కార్పొరేషన్ మేయర్‌గా ఉన్న సమయంలో అప్పట్లో అధికార పగ్గాలు చేపట్టిన జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి స్టాలిన్ హాజరై , తన ప్రోటాకాల్‌ను నిరూపించుకున్నారు. ఆ సమయంలో ఆయన ప్రోటాకాల్ పాటిం చినా, అన్నాడీఎంకే వాళ్లు మాత్రం ఖాతరు చేయక, ఎక్కడో ఓమూలన సీటు కేటాయించారు. అప్పటి నుంచి డీఎంకే తరఫున ఏ ఒక్కరూ అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే జరిగే అధికారిక కార్యక్రమాలకు వెళ్లకుండా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, ఈ సారి తనలోని రాజకీయ సత్సాంప్రదాయం చాటే దిశగా స్టాలిన్ ముందుకు సాగి మార్కులు కొట్టేసినా, ఆయనకు మర్యాద ఇవ్వక వివాదాన్ని అధికార పక్షం కొనితెచ్చుకున్నట్టు అయ్యింది.
 
ఆదిలోనే వివాదం :
బలమైన ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎంకేను ప్రమాణ స్వీకారానికి అధికారులు ఆహ్వానించారు. ఈ పిలుపుతో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్, మాజీ మంత్రులు ఏవి వేలు, పొన్ముడి, ఎమ్మెల్యేలు శేఖర్ బాబు, ఎం సుబ్రమణియన్, కేకే సెల్వం, వైగై చంద్ర శేఖర్ తదితరులు మద్రాసు వర్సిటీ సెంటినరీ హాల్ వద్దకు ఉదయం పదిన్నర గంటలకు చేరుకున్నారు. వారు వచ్చిన వాహనాల్ని తొలుత లోనికి అనుమతించని అధికారులు, చివరకు  స్టాలిన్ వాహనం మాత్రం పంపించారు.  వెనుక వచ్చిన  ఎమ్మెల్యేలు ప్రవేశ మార్గంలో దిగి,  భద్రతా తనిఖీల మార్గం గుండా లోనికి  చేరుకోవాల్సి వచ్చింది. స్టాలిన్ వెంట డీఎంకే  ఎమ్మెల్యేలు కదిలి రావడంతో ఒక్క సారిగా సెంటినరి హాల్ ఆడిటోరియంలో అందరి దృష్టి వారి మీద పడింది.

కొందరు అన్నాడీఎంకే నాయకులు విక్టరీ చిహ్నం చూపుతూ స్టాలిన్‌ను హేళన చేసే ప్రయత్నం చేయగా ఆయన చిరునవ్వుతో సమాధానమిచ్చారు. అయితే ఆ తర్వాత కూడా కనీస మర్యాద కూడా దక్కలేదని చెప్పవచ్చు. డీఎంకే ఎమ్మెల్యేలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్షం ముఖ్య ప్రతినిథిగా హాజరైన స్టాలిన్‌కు అయినా, మొదటి వరుసలో సీటు కేటాయించకుండా, గుంపులో గోవిందా...అన్నట్టుగా పన్నెండో వరసలో సీటు  కేటాయించారు. ఓ దశలో స్టాలిన్ ఉద్వేగానికి లోనైనట్టు కన్పించగా, సమావేశానంతరం కనీస మర్యాద అన్న అంశం  వివాదానికి దారి తీసింది.

ఎన్నికల్లో ఓటమి చవి చూసిన సినీ నటుడు శరత్‌కుమార్, సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి టి పాండియన్, జయలలిత నెచ్చెలి శశికళ వారి సన్నిహితులతో పాటుగా మరి కొందర్ని  ముందు వరుసలో కూర్చోబెట్టిన అధికారులు,  ప్రధాన ప్రతి పక్షానికి చెందిన ముఖ్య ప్రతినిధిని గుంపులో గోవిందా..అన్నట్టుగా కూర్చోపెట్టడం భావ్యమా..? అని ప్రశ్నించే వాళ్లు పెరిగారు.

కరుణ ఆగ్రహం:
ఇదే విషయంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్పందిస్తూ, శరత్‌కుమార్ లాంటి వాళ్లను ముందు వరసలో కూర్చోబెట్టి, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎక్కడో కూర్చొబెట్టడమేనా మర్యాదా..? అని ప్రశ్నించారు. ఆమె మారదు..మార్చలేం అంటూ, ముందుగా తమిళ ప్రజలు మారాలని సూచించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు