నిజమేనా?, ఓ అభిమాని వెల్లడి!

23 Aug, 2017 07:50 IST|Sakshi
నిజమేనా?

వచ్చేనెలలో రజనీకాంత్‌ పార్టీ
పేరు, పతాకం, చిహ్నం, మేనిఫెస్టోలకు కసరత్తు
చెన్నైలో భారీ మహానాడు...
ఓ అభిమాని వెల్లడి


‘ఇదిగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు.. పార్టీని ప్రకటించేస్తున్నాడు..’ తమిళనాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై రెండు దశాబ్దాలకాలంగా రాష్ట్రంలో ఇదే ప్రచారం. వచ్చే నెలలో అభిమానులు ఏర్పాటుచేసే భారీ మహానాడులో రజనీకాంత్‌ పార్టీని ప్రకటిస్తారని ఆయన అభిమాని తాజాగా మరో సమాచారం మీడియా చెవినవేశాడు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ ప్రవేశం ఖాయమన్నట్లుగా ఈ ఏడాది మేలో మూడు రోజులపాటూ అభిమానులతో నిర్వహించిన సమావేశంలో రజనీ సంకేతాలు ఇచ్చారు. ఇది రాష్ట్రంలో భారీస్థాయిలో చర్చకు దారితీసింది. కొందరు వ్యతిరేకించగా, మరికొందరు అనుకూలంగా మాట్లాడారు. రజనీకాంత్‌ రాజకీయాలు మాట్లాడడం కొత్తేమీ కాదు. సుమారు 20 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకేకి అనుకూలంగా మాట్లాడి భారీ విజయానికి కారకుడైనారు. అయితే ఆనాటి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దుమారం రేగడంతో కొంతకాలం మిన్నకుండిపోయారు. అయినా, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వచ్చినపుడల్లా రజనీ కోసం పార్టీలు పట్టుబట్టడం, సున్నితంగా ఆయన తిరస్కరించడం పరిపాటిగా మారింది.

రజనీ అభిమాని ప్రకటన
తాజాగా రజనీ అభిమాని ఒకరు వచ్చేనెలలోనే రజనీ రాజకీయ ప్రకటన అంటూ మీడియా ముందుకు వచ్చారు. ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.  ‘‘ప్రస్తుతం రజనీ చేతుల్లో 2ఓ, కాలా అనే రెండు సినిమాలు ఉన్నాయి. 2 ఓ పూర్తయింది, కాలా షూటింగ్‌ ఈనెలాఖరులో ముగుస్తుంది. వీటి నుంచి బయటపడగానే వచ్చే నెలలో పార్టీ పనులపై రజనీ దృష్టి సారిస్తారు. రజనీకి అత్యంత సన్నిహితులు పార్టీ పేరు, పతాకం, చిహ్నం, మేనిఫెస్టో తయారు చేసే పనుల్లో తలమునకలై ఉన్నారు. వచ్చే నెలలో చెన్నైలో అభిమానులు నిర్వహించే భారీ మహానాడులో పార్టీ గురించి రజనీకాంత్‌ ప్రకటిస్తారు. పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

 ఒకవేళ వచ్చే నెలలో సాధ్యం కాని పక్షంలో అభిమానులతో మరోసారి సమావేశం అవుతారు. డిసెంబరు 12వ తేదీన జన్మదిన వేడుకలు లేదా జనవరిలో 2ఓ సినిమా విడుదల తరువాత పార్టీని ప్రకటించడం ఖాయం’’అని ఆయన అన్నారు. రజనీ రాజకీయాలపై మరో అపప్రద కూడా ఉంది. రజనీ ఇక రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నాడు, ఇదే చివరి చిత్రం అనే తీరులో తన చిత్రాల విడుదలకు ముందు భారీ పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రచారానికి రజనీ పూనుకుంటాడని వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. అభిమాని చెప్పిన మాటలు నిజమేనా అనేందుకు మరికొంతకాలం వేచిచూడక తప్పదు.

జయ మరణం తరువాత..
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత రజనీ ధోరణిలో మార్పు వచ్చింది. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూడ్చాలనే భావన పెరిగింది. అందుకే అభిమానులతో ‘ట్రయల్‌’ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ప్రజల, పార్టీల స్పందనను తెలుసుకున్నారు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చేనా అనే సందేహం ఉన్నా, దాదాపు ఖాయమనే ప్రచారమే గట్టిగా వినిపిస్తోంది.

రజనీకాంత్‌ ఈ విషయంపై నోరు మెదపకున్నా ఆయన స్నేహితుడు రాజ్‌బహదూర్, సోదరుడు సత్యనారాయణ, గాంధేయ మక్కల్‌ ఇయక్కం అధ్యక్షులు తమిళరువి మణియన్‌ ఎవరికివారు రాజకీయ అరంగేట్రం ఖాయమని అనేకసార్లు మీడియా వద్ద ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరు 12వ తేదీన రజనీ జన్మదినం.. అదే రోజున పార్టీ ఆవిర్భావ ప్రకటన ఉంటుందని వారు ప్రకటించేశారు.

మరిన్ని వార్తలు