స్వామీజీ ముసుగులో పిల్లల అపహరణ

19 Oct, 2013 02:37 IST|Sakshi

 

= పట్టుబడిన నిందితులు
 = పసిపాప స్వాధీనం

 
చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : పసిపిల్లలను అపహరించి విక్రయిస్తున్న దొంగస్వామీజీ గుట్టు రట్టయింది. ఆశ్రమంపై గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించి దొంగస్వామీజీ, అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ పసిపాపను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.... చిక్కబళ్లాపురం సమీపంలోని బాపనహళ్లి గ్రామం వద్ద శాప విమోచన పేరుతో ఓ ఆశ్రమాన్ని శ్రీనివాస గురూజీ నిర్వహిస్తున్నాడు. స్వామీజీ వద్ద మురళీ, రీనా, కుమారి శిష్యరికం చేస్తున్నారు.

ఈ ముగ్గురూ ఆస్పత్రుల్లో సంచరిస్తూ పసిపిల్లలను అపహరించుకెళ్లి స్వామీజీకి అప్పగించేవారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా పసిపిల్లలను రూ. రెండు నుంచి రూ. నాలుగు లక్షల వరకు స్వామీజీ విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. విషయం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మంజునాథగౌడ పథకం ప్రకారం స్వామీజీ వద్దకు గురువారం చేరుకుని తనకు ఓ పసిపాప కావాలని అడిగారు.

ఇందుకు రూ. 2 లక్షలు, మూడు టన్నుల ఇనుము, వంద సిమెంట్ బస్తాలు ఇవ్వాలని స్వామీజీ అడిగాడు. ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు రాత్రికి పోలీసులతో సహా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఓ పసిపాపను స్వామీజీ శిష్యులు తీసుకొచ్చి వారికి చూపించి, గురూజీ అడిగిన మొత్తం ఇవ్వాలని అడిగారు. అదే సమయంలో తాము పోలీసులమంటూ డీవైఎస్పీ దేవయ్య, సీఐ బాలాజీసింగ్, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నయాజ్‌బేగ్ తెలిపి, నిందితులను అదుపులో తీసుకున్నారు. పసిపాపను స్వాధీనం చేసుకుని నిందుతులపై శుక్రవారం కేసు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు