పోలీసు మెడకు రామ్‌కుమార్ ఉచ్చు

20 Sep, 2016 01:16 IST|Sakshi
పోలీసు మెడకు రామ్‌కుమార్ ఉచ్చు

సాక్షి ప్రతినిధి, చెన్నై:  జూన్ 24వ తేదీన నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతి దారుణహత్య, తిరునెల్వేలీలో నిందితుడు రామ్‌కుమార్ అరెస్ట్, అతను అసలైన నిందితుడు కాదనే వాదనలు ఇలా ఈ కేసులో ప్రతి అడుగు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. క్రైం సినిమాను తలపించే రీతిలో మూడు నెలలుగా సాగుతున్న ఈ కేసు నిందితుడు రామ్‌కుమార్ ఆత్మహత్యతో సరికొత్త మలుపు తిరిగింది. జైలులోని కరెంటు వైరును నోటితో కొరికి బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసు వర్గాల కథనం. వేలాది మంది ఖైదీలు, వందలాది మంది జైలు సిబ్బంది గస్తీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక ఖైదీ అంత సులువుగా కరెంటువైరు కొరికి ఉంటాడని, ఒక ఖైదీ ఇంత దారుణానికి పాల్పడుతుంటే సిబ్బంది ఏమి చేస్తున్నట్లు అనే అనుమానాలు తలెత్తాయి.
 
 రామ్‌కుమార్‌ది ఆత్మహత్య కాదు, హత్య అని అతని తండ్రి పరమశివం తదితరులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడిని పథకం ప్రకారం హతమార్చారని పరమశివం ఆరోపిస్తున్నారు. రామ్‌కుమార్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, అప్పటి వరకు మృతదేహాన్ని తీసుకునేది లేదని ఆయన అన్నారు. రామ్‌కుమార్ నిందితుడే కాదని మరో ప్రచారం సాగుతున్న తరుణంలో అనుమానాస్పద స్థితిలో అతను అంతం కావడంతో స్వాతి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రామ్‌కుమార్ మరణంపై ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించడంతో పోలీసు శాఖ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
 పోస్టుమార్టంపై హైకోర్టు స్టే
 రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టంపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. రామ్‌కుమార్ మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రమే చేర్చినా హై కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. రాయపేట ఆసుపత్రి చుట్టూ పెద్ద ఎత్తున ఆదివారం అర్ధరాత్రి వరకు రామ్‌కుమార్ బంధువులు, సానుభూతిపరులు చుట్టుముట్టి ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు బందోబస్తు పెట్టారు. రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ప్రత్యేకంగా వైద్యబృందాన్ని నియమించారు.
 
ఈ బృందం సోమవారం ఉదయం పోస్టుమార్టం చేయాల్సి ఉండగా రామ్‌కుమార్ న్యాయవాదులు రామ్‌రాజ్, విజయేంద్రన్ హైకోర్టును ఆశ్రయించారు. రామ్‌కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నందున పోస్టుమార్టంపై నిషేధం విధించాలని, ఈ కేసును అత్యవసర కేసుగా స్వీకరించాలని కోరారు. అయితే అత్యవసర కేసుగా తీసుకోవడం కుదరదని న్యాయమూర్తులు నిరాకరించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకు పోస్టుమార్టంను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది హామీ ఇవ్వడంతో ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తులు... రామ్‌కుమార్ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు పోస్టుమార్టంపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు.
 
 ప్రతిపక్షాల భగ్గు
 స్వాతి హత్యకేసులో నిందితుడు రామ్‌కుమార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సోమవారం డిమాండ్ చేశారు. ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధ్యక్షుడు రాందాస్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, డీఎండీకే మహిళా విభాగం కార్యదర్శి ప్రేమలత తదితరులు ఈ అంశంపై గళమెత్తారు. రామ్‌కుమార్ మరణం వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాలని వారు డిమాండ్ చేశారు. పుళల్ జైలు వద్ద సోమవారం విపక్ష పార్టీలు ఆందోళన, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించి నిరసన ప్రకటించాయి. అలాగే రామ్‌కుమార్ సొంతూరు సెంగోట్టై సమీపం మీనాక్షిపురంలో అతని బంధుమిత్రులు సోమవారం ఆందోళన జరిపారు. ఈ సందర్భంగా మూడు ప్రభుత్వ బస్సులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.
 
 న్యాయవిచారణ ప్రారంభం
 రామ్‌కుమార్‌ది సహజమరణం కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ కారణంగా ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి తమిళ్‌సెల్వి సోమవారం ఉదయం 9.20 గంటలకు రాయపేట ఆసుపత్రికి వచ్చారు. రామ్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అతని శరీరంపై ఉన్న గాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స చేసిన డాక్టర్లను విచారించి అక్కడి నుంచి పుళల్ జైలుకు చేరుకున్నారు. రామ్‌కుమార్ ఉన్న గది, కరెంటువైరు కొరికిన ప్రాంతాన్ని పరిశీలించి జైలు అధికారులను విచారించారు.                

మరిన్ని వార్తలు