అక్కడ అడుగు పెడితే క్షణాల్లో మాడిమసి...

17 Apr, 2017 11:41 IST|Sakshi
అక్కడ అడుగు పెడితే క్షణాల్లో మాడిమసి...

మైసూరు :  కర్ణాటక మైసూరు నగర శివార్లలో భూమి అగ్నిగుండంలా కుతకుత ఉడుకుతున్న వింత ఘటన  వెలుగు చూసింది. ఇలా నిప్పు కణికలా మారిన భూమిపై అడుగు పెట్టిన ఓ బాలుడు మాడి మసైన ఘటనతో కలకలం రేపింది. ఇలాంటి విచిత్ర, వింతైన, అరుదైన, భయానకమైన ఘటన మైసూరు నగర శివార్లలోని బెలవత్త గ్రామంలో జరిగింది. ఓ బాలుడు చికిత్స పొందుతూ మరణించగా, మరో బాలుడు మనోజ్‌ తీవ్రం గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం మైసూరులోని కేఆర్‌ ఆస్పత్రికి తరలించారు. అతడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యలు వెల్లడించారు.

కాగా  మైసూరు క్యాతనహళ్లికి చెందిన మూర్తి, జానకి దంపతుల కుమారుడు హర్షల్‌(14) తన నలుగురు స్నేహితులతో కలిసి ఈ నెల 14న కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అక్కడ నేల కుతకుత ఉడుకుతుండటంతో ఆశ్చర్యపోయి అక్కడ అడుగు పెట్టి చూద్దామని అడుగు ముందుకేశాడు. బిగ్గరగా అరుస్తూ కుప్పకూలిపోవడంతో అతడిని రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించగా, అప్పటికే హర్షల్‌ భూమిలోకి చిక్కుకు పోయి కాలిపోయాడు. తీవ్రంగా కాలిన గాయాలైన అతనిని వెంటనే స్నేహితులు ఇతరుల సాయంతో వెలికితీశారు. సమాచారం అందిన వెంటనే అతని కుటుంబసభ్యులు హర్షల్‌తో పాటు మనోజ్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ హర్షల్‌ ఆదివారం సాయంత్రం మరణించాడు. దీంతో హర్షల్‌ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం అందించేంతవరకూ మృతదేహానికి అంత్యక్రియలు జరపమంటూ నిరసన వ్యక్తం చేశారు.

 మైసూరు కుంబార కొప్పలు నివాసి సోమణ్ణకు క్యాతనహళ్లి పరిధిలో నాలుగు ఎకరాల పొలం ఉంది.  అయితే అందులో ఎలాంటి వ్యవసాయం చేయడం లేదు.  ఆ పొలంలోని కొంత భాగం భూమి నిప్పు కణికలా మారి కుతకుత ఉడుకుతోంది. అక్కడ కాలు పెడితే చాలు కాలిపోయి భూగర్భంలోకి చేరక తప్పని భయానక వాతావరణం నెలకొంది.  భూమి అలా మారటానికి రసాయనిక వస్తువులు, ఘన వ్యర్థపదార్థాలు అక్కడ చేరుతుండటమే కారణమని తెలుస్తోంది.  గత వారం రోజులుగా  సోమణ్ణ పొలంలో భూమి కుతకుత ఉడుకుతూ పొగలు కక్కుతోంది. రాత్రివేళ ఆ భూమిని చూస్తే అగ్నిగుండంలో కనిపిస్తోందని, నిప్పు సెగ కూడా చాలా దూరం వరకు ఉంటోంది.

వారం రోజులుగా నిప్పులు కక్కుతున్న ఆ పొలంలోకి వెళ్లిన గొర్రెలు, కుక్కలు చనిపోయాయని, ఈ విషయంపై అధికారులు ఎలాంటి అప్రమత్తంగా వ్యవహరించ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఓ బాలుడు బలి కావడంతో ఆ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా పోలీసులు ప్రకటించారు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న మెటగల్లి పోలీసులు అక్కడ నిషేధిత ప్రాంతంగా బోర్డు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న గనులు, భూగర్భ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలన జరుపుతున్నారు.

రసాయనిక వస్తువులు ఎక్కువగా అక్కడకు చేరుతుండటం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని భూగర్భ శాస్త్రవేత‍్త  ప్రభాకర్‌ పేర్కొన్నారు. మరోవైపు  ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు రమేష్‌ బాబు తెలిపారు.  సమీపంలోని కర్మాగారాలు, ఆస్పత్రుల నుంచి తెచ్చిన రసాయనిక ఘనవ్యర్థాలను అక్కడ పారవేసినందునే రసాయనిక క్రియ జరిగి భూమి ఇలా కుతకుత ఉడుకుతోందని అన్నారు. విచారణ  అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.

>
మరిన్ని వార్తలు