ఆమ్‌ఆద్మీ పార్టీకి రైతు బాసట

23 Jan, 2014 00:02 IST|Sakshi

కొల్హాపూర్: దక్షిణ మహారాష్ట్రలో ‘సామాన్యుడి’కి రైతు బాసటగా నిలిచాడు. రైతు నాయకుడు రఘునాథ్‌దాదా పాటిల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంతో రాష్ట్రంలో ఆ పార్టీకి సామాన్యులతోపాటు రైతుల మద్దతు కూడా లభించనుంది. ‘షేత్కారీ సంఘటన’ సంస్థ స్థాపన ద్వారా కొల్హాపూర్, సంగ్లీ, సతారా జిల్లాల్లో మంచి పట్టు సంపాదించిన దాదా చేరికతో ఆప్‌కు మరింత ఊపు వచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, తమ పార్టీలో రఘునాథ్‌దాదా పాటిల్ చేరినట్లు బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు లాంఛనంగా ప్రకటించారు. ఆప్‌లో చేరిన తర్వాత రఘునాథ్ దాదా మీడియాతో మాట్లాడారు.

 ‘గత లోక్ సభ  ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమితో నా సంస్థ కలిసి పనిచేసింది. అయితే రైతు సమస్యలపై వారి ఆలోచ నా విధానం మాకు సంతృప్తినివ్వలేదు.  రైతులు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, ఇతర సమస్యలపై మా సంస్థ కాంగ్రెస్, ఎన్సీపీ సర్కారుపై బయటనుంచి పోరాటాలు చేస్తుంటే బీజేపీ, శివసేన కూటమి ఏమాత్రం మాకు మద్దతుగా నిలవలేదు. విధాన సభలో రైతు సంబంధ విషయాలపై ఎన్నడూ మాట్లాడలేదు. అందువల్లనే ఆ కూటమిని వీడి నేడు నేను ఆప్‌లో చేరాల్సి వచ్చింది..’ అని దాదా తెలిపారు. ‘రాజుశెట్టి స్వాభిమాని షేట్కారీ సంఘటనతో సంబంధాలు వల్ల బీజేపీ, శివసేన కూటమికి ఒరిగేమీ లేదు.

 నేను రాజకీయాల్లో పోటీ చేయడానికి ఈ పార్టీలో చేరలేదు.. సమస్యలపై పోరాడటానికి ఒక వేదిక దొరుకుతుందని మాత్రమే ఇందులో చేరాను.. అయితే పార్టీ ఆదేశిస్తే హట్కానంగలే స్థానం నుంచి లోక్‌సభకు పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నాను..’ అని ఆయన స్పష్టం చేశారు. షేట్కారీ సంఘటన సంస్థకు దక్షణ మహారాష్ట్రలోనే కాక మహారాష్ట్ర మొత్తం రైతుల మద్దతు ఉందని దాదా తెలిపారు.

 ఆప్ కొల్హాపూర్ జిల్లా అధ్యక్షుడు నారాయణ్ పవార్ మాట్లాడుతూ.. దాదా చేరికతో మా పార్టీకి గ్రామీణ స్థాయిలో మరింత పట్టు లభించనట్లయ్యింది. ఆయన పార్టీ అభ్యున్నతి కోసం కార్యకర్తలతో కలిసి చురుకుగా పనిచేస్తారని ఆశిస్తున్నాం..’ అని అన్నారు. ‘మా పార్టీలో చేరడానికి గ్రామీణ ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఎటువంటి శిబిరాలు నిర్వహించకుండానే సుమారు ఐదు వేల మంది ఇప్పటికే పార్టీలో చేరారు. వారితో పాటు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వయోజనులు, యువకులు, విద్యార్థులను సైతం పార్టీలో చేర్చుకుంటున్నాం.

దాదా చేరికతో రైతులు సైతం మా పార్టీని ఆదరిస్తారు..’ అని నారాయణ్ పవార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై స్వాభిమాని షేట్కారీ సంఘటన నాయకుడు రాజు శెట్టి మాట్లాడుతూ.. ‘ఆప్‌లో ఎవరు చేరినా మా పార్టీకి ఎటువంటి నష్టం లేదు. దక్షిణ మహారాష్ట్రలో ఉన్న ఇతర రైతు సంఘాలు ఆప్‌తో కలిసినా మాతో పోటీ పడలేర’ంటూ పరోక్షంగా ఆప్‌లో దాదా చేరికపై వ్యాఖ్యానించారు. ‘వారి చర్య వల్ల రైతుల్లో ఎటువంటి విభజన రాదు. వారు మాతోనే ఉంటారు..’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ 2009 లోక్‌సభ ఎన్నికల్లో హట్కానంగలే నియోజకవర్గంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు.

 నేను రఘునాథ్ దాదాపై రికార్డుస్థాయి మెజారిటీతో గెలిచాను. ఈసారీ అదే ఫలితం పునరావృతమవుతుంది..’ అని జోస్యం చెప్పారు. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో హట్కానంగలే నియోజకవర్గంలో శివసేన తరఫున రఘునాథ్ దాదా పాటిల్ పోటీచేయగా, ఎన్సీపీ తరఫున నివేదిత మానే, స్వాభిమాని షేట్కారీ సంఘటన తరఫున రాజుశెట్టి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో రాజు శెట్టి 4,81,000 ఓట్లు సాధించి గెలుపొందగా, 3,85,000 వేల ఓట్లతో రెండోస్థానంలో నివేదిత, కేవలం 55 వేల ఓట్లతో దాదా మూడోస్థానంలో నిలిచారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు