నేడు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం

31 Dec, 2015 03:06 IST|Sakshi

రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన నేతలు
 నగరమంతా పార్టీ ప్రచారాల సందడి
 ప్రసంగించనున్న పార్టీ అధినేత్రి జయలలిత
 హైకోర్టులో ట్రాఫిక్ రామస్వామి పిటిషన్
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న తరుణంలో అన్నాడీఎంకే సర్వసభ్య, కార్యనిర్వాహక సమావేశాలకు సమాయత్తం అయింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత చేయబోతున్న ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చెన్నై తిరువాన్మియూరులోని డాక్టర్ వాసుదేవన్ నగర్ శ్రీ రామచంద్ర వైద్యకళాశాల, పరిశోధన ప్రాంగణంలో గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశాలను ప్రారంభించేందుకు భారీ ఏ ర్పాటు చేశారు.  అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ కూ టమి ఏర్పాట్లు, ఎన్నికల ఎత్తుగడల్లో తలమునకలై ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు, జాతీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీలు సైతం ఎన్నికల కసరత్తులను వేగవంతం చేశాయి.
 
  ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే తొలిసారిగా తాజా ఎన్నికలకు సమాయత్తం కావడంలో భాగంగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే చెన్నైలో బసచేసి ఉండగా, రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లా కమిటీలు, కార్యకర్తలు బుధవారం సాయంత్రానికే పెద్ద సంఖ్యలో చెన్నైకి చేరుకున్నారు.   పార్టీ ఉన్నతస్థాయి సమావేశం జరిగే ప్రాంగణం వరకు జయలలిత పయనించే మార్గాలన్నీ బ్యాన ర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలతో నిండిపోయాయి. నగరంలో ఎటుచూసినా అన్నాడీఎంకే పతాకాలు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఉదయం 9.30 గంటల కల్లా తమకు కేటాయించిన సీట్లకు చేరుకోవాలని పార్టీ ఆదేశించింది.
 
  పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత సభాస్థలికి రాగానే ముందుగా కార్యవర్గ సమావేశం, ఆ తరువాత సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. సర్వసభ్య సమావేశంలో సీనియర్ నేతలను స్వాగతిస్తూ ప్రసంగించిన తరువాత నలుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు మాట్లాడుతారు. చివరగా తీర్మానాలు చేస్తారు. చివరగా జయలలిత ప్రసంగిస్తారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందాలనే అంశంపై జయ దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నారు. ఇటీవల చెన్నైని ముంచెత్తిన వరదల సమయంలో అధికార పార్టీ కొంత అప్రతిష్ట మూటకట్టుకున్న తరుణంలో సాగుతున్న సమావేశం కావడంతో జయ ఎలా సమర్థించుకుంటారని ఆసక్తి నెలకొంది.
 
 గత 2011 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే, వామపక్షాలు, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం, సమత్తువ మక్కల్ కట్చి, కుడియరసు కట్చి, ఫార్వర్డ్‌బ్లాక్, కొంగుపేరవై పార్టీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కూటమిలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కొత్తగా ఎన్నికల బరిలోకి దిగనున్న తమాకా జీకే వాసన్ అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే గురువారం నాటి సర్వసభ్య సమావేశ ప్రసంగంలో జయలలిత పొత్తుల అంశం జోలికి వెళ్లకుండా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నూరిపోసే ప్రయత్నం మాత్రమే చేస్తారని అంచనాగా ఉంది.
 
 ట్రాఫిక్ రామస్వామి పిటిషన్:అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ ట్రాఫిక్ రామస్వామి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నందున నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు.
 

మరిన్ని వార్తలు