టమా‘ఠా’

1 Jan, 2014 02:50 IST|Sakshi
రాష్ట్ర రాజధాని నగరంలో టమాటా ధర చతికిల బడింది. వారం రోజుల క్రితం వరకు రూ.40 పలికిన ధర ఉన్నట్టుండి కిలో రూ.ఏడు, పదికి పడిపోంది. ఉత్పత్తి గణనీయంగా పెరగడంతోనే ధర తగ్గించాల్సి వచ్చిందని వర్తకులు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో వినియోగం కంటే సరఫరా అధికంగా ఉందని చెబుతున్నారు.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కొన్ని నెలలుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతూ వస్తున్నాయి. ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తే, టమాటా ప్రియంగా మారింది. దీంతో ఏకంగా కూరగాయల విక్రయాన్ని స్వయంగా ప్రభుత్వమే చేపట్టింది. తోట పచ్చదనం దుకాణాల్ని ఏర్పాటు చేసి కూరగాయల్ని నగరవాసులకు అందించడం ప్రారంభించింది. బయటి మార్కెట్లలో పోల్చితే ఈ దుకాణాల్లో 25 నుంచి 40 శాతం వరకు ధరలు తక్కువే. దీంతో ఈ దుకాణాలు ప్రజాదరణ పొందాయి.
 
  ఇంటి వద్దకే కూరగాయలు తీసుకెళ్లి విక్రయించే పథకం కసరత్తుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో వారం రోజులుగా కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. కిలో రూ.100 వరకు పలికిన ఉల్లి ప్రస్తుతం పేదోడు కొనేట్టుగా రూ. 20 -25కు చేరింది. ఉల్లి ధర తగ్గిందో లేదో ప్రస్తుతం టమాటా ధర చతికిలబడింది. గత వారం వరకు రూ. 50. నుంచి రూ.70 పలికిన టమాటా ప్రస్తుతం రూ. 10 నుంచి 12 వరకు పడిపోయింది. ఇక రెండో రకం టమాటా రూ.7 నుంచి రూ.10 వరకు పలుకుతోంది. రాష్ట్రంలో అన్ని మార్కెట్లలోను ఇదేరకంగా ధర పలుకుతోంది. కొన్ని గ్రామీణ మార్కెట్లలో అయితే, రూ.5, రూ.7కు లభిస్తుండటం విశేషం.
 
 పెరిగిన ఉత్పత్తి: రాష్ట్రంలో ఈ ఏడాది టమాటా ఉత్పత్తి పెరిగినట్టు టోకు వర్తకులు పేర్కొంటున్నారు. ఉత్పత్తి పెరగడం, ధర తగ్గడం అన్నదాతను, టోకు వర్తకుల్ని కలవరంలో పడేస్తున్నాయి. ఇది వరకు చెన్నై కోయంబేడు మార్కెట్‌కు రోజుకు 40 టన్నుల టమాటా వచ్చేది. ప్రస్తుతం 60 నుంచి 70 టన్నుల మేరకు టమాట వస్తోంది. దక్షిణాది జిల్లాల్లో ఈ ఏడాది ఉత్పత్తి గణనీయంగా పెరగడంతోనే కోయంబేడుకు అత్యధిక శాతం టమాటా వస్తున్నట్టుగా వర్తకుడు సౌందరరాజన్ పేర్కొన్నారు. దిండుగల్, ఉడుమలై పేట, ఒట్టన్ చత్రంలలో మరీ ఎక్కువగా ఉత్పత్తి ఉందని, ధర మరింత తగ్గే అవకాశం ఉందన్నారు.   
మరిన్ని వార్తలు