అమిత్‌ షాకు అవగాహన లేదు: టీఆర్‌ఎస్‌

23 May, 2017 16:14 IST|Sakshi
హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు తెలంగాణ పరిస్థితులపై అవగాహన లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక బీజేపీ నేతలు చెప్పిన అవాస్తవాలను అమిత్‌షా మాట్లాడారని, ప్రధాని మోడీతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ఎన్నోసార్లు పొగిడారని చెప్పారు.
 
తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తున్నదంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీ మేనిఫెస్టోను పరిశీలించడంటూ చురకలంటించారు. విదేశాల నుంచి నల్ల డబ్బు తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని ఎన్నికలపుడు బీజేపీ హామీ ఇచ్చిందని.. ఎవరి అకౌంట్‌లోనైనా డబ్బులు పడ్డాయా.. రైతు ఆత్మహత్యలు దేశంలోనే ఎక్కువ జరుగుతోంది బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలో కాదా అని నిలదీశారు. దేశంలో రైతాంగ సంక్షేమానికి కట్టుబడ్డ ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు.
 
దేశంలో అత్యధిక మొత్తంలో రైతు రుణాలు మాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని, రైతు రుణ మాఫీని యూపీలో బీజేపీ కాపీ కొట్టిందంటూ మూడేళ్ళలో రైతులకు కేంద్రం ఏం చేసిందో అమిత్ షా చెప్పాలని డిమాండ్‌ చేశారు. అబద్దాలతో తెలంగాణ ప్రజలను బీజేపీ మభ్యపెడితే ఎవ్వరూ ఒప్పుకోరన్నారు. మోడీ ఓ వైపు తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటుంటే.. అమిత్ షా విమర్శించడం సమంజసం కాదని భానుప్రసాద్‌, ప్రభాకర్‌రెడ్డిలు అన్నారు.
>
మరిన్ని వార్తలు